
సాక్షి, తూర్పు గోదావరి: బీజేపీ చేరేందుకు చాలా మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తమ పార్టీ ఎన్జీఓ, ట్రస్ట్ కాదని ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేరవచ్చని పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రానున్న రోజుల్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని 2024 ఎన్నికలలోపు ఓ బలమైన శక్తిగా తయారు చేయాలన్నదే మా లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగానే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు తమ పార్టీలో చేరారని వివరించారు.
దేశంలో అన్ని పార్టీల నుంచి నాయకులు తమ వైపు చూస్తున్నారని.. ఎవరు వచ్చినా మా పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు. కాగా ఏపీలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు అధికార బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. రాజ్యసభలో వారిని విలీనం చేయాలని సభ చైర్మన్‌కు ఇచ్చిన వినతి పత్రాన్ని వెంకయ్య నాయుడు ఈరోజు ఆమోదించారు. దీంతో నేటి నుంచి రాజ్యసభలో వారు బీజేపీ సభ్యులుగా కొనసాగనున్నారు.