బోగోలు మండ లం విశ్వనాథరావుపేట పంచాయతీ కొత్తూరు నుంచి కొండబిట్రగుంట వెళ్లే మార్గంలో సమాధుల పక్కనే...
ఉపాధిహామీ తవ్వకాల్లో బయటపడిన మకరతోరణం ముక్కలు
పంచలోహ విగ్రహాలు మాయం చేశారంటూ వదంతులు
బిట్రగుంట : బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ కొత్తూరు నుంచి కొండబిట్రగుంట వెళ్లే మార్గంలో సమాధుల పక్కనే ఉపాధిహామీ తవ్వకాల్లో శుక్రవారం బయటపడిన మకరతోరణం ముక్కలు కలకలం రేపాయి. ఉపాధిహామీ పథకం కింద కూలీలు పనులు చేస్తుండగా పంచలోహ విగ్రహాలు, మకర తోరణం బయటపడిందని, విలువైన విగ్రహాలు మాయం చేసి మకరతోరణం మాత్రమే ఉంచారనే ప్రచారం జరగడంతో అధికారులు శనివారం ఉదయాన్నే ఆగమేఘాలమీద పరుగులు తీశారు.
కేవలం మకరతోరణం ముక్కలు మాత్రమే బయటపడినట్లు కూలీలు స్పష్టం చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తూరు -కొండబిట్రగుంట మధ్య శ్మశానవాటిక పక్కనే మూడు రోజుల నుంచి ఉపాధిహామీ పథకం కింద పశువులకు తాగునీటి గుంత తవ్వుతున్నారు. శుక్రవారం సుమారు 35 మంది కూలీలు తవ్వకాలు సాగిస్తుండగా అడుగున్నర లోతులో ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలకు అలంకరించే మకరతోరణం బయటపడింది.
మకరతోరణం ఆరు ముక్కలుగా ఉండటం, అంతగా ఖరీదైనది కాకపోవడంతో ముక్కలు పక్కన పడేసి కూలీలు యథావిధిగా పనులు చేసుకున్నారు. శనివారం ఉదయం స్థానికంగా పలు వదంతులు వ్యాపిం చాయి. పంచలోహ విగ్రహాలు, మకరతోరణం బయటపడిందని, విగ్రహాలు మాయం చేసి మకర తోరణం మాత్రమే అక్కడే పడేశారని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మకతోరణాన్ని పరిశీలించించారు. తహశీల్దార్ జయప్రకాష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది మకరతోరణాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు, పురావస్తుశాఖకు సమాచారం అందించారు.