రిజిస్ట్రేషన్..పరేషాన్ | maintains two responsibilities in dr office | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్..పరేషాన్

Jul 19 2014 1:20 AM | Updated on Sep 2 2017 10:29 AM

డీఆర్ కార్యాలయంలో ఒక ఉద్యోగి రెండేసి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ ఆదినారాయణ లాంగ్‌లీవులో వెళ్లారు.

 డీఆర్ కార్యాలయంలో ఒక ఉద్యోగి రెండేసి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ ఆదినారాయణ లాంగ్‌లీవులో వెళ్లారు. హెడ్‌క్లర్క్ జయకుమార్ ఆదోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి డెప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో డీఐజీ కార్యాలయం నుంచి వచ్చిన  సీనియర్ అసిస్టెంట్ రాముడు హెడ్‌క్లర్క్‌తోపాటు సొసైటీ రిజిస్ట్రేషన్ విధులు నిర్వహిస్తున్నాడు. జూనియర్ అసిస్టెంట్ లలిత్‌కుమార్ చిట్స్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రెండింటి విధులను నిర్వహిస్తున్నారు.

 ఖాళీగా ఉన్న డీఆర్ పోస్టులు: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలకమైన మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కర్నూలు జిల్లా రిజిస్ట్రార్‌గా  ఎన్.మాధవి విధులు నిర్వహిస్తూ కార్యాలయానికి వచ్చిన వ్యక్తి కేసీ రాముడితో లంచం తీసుకుంటూ గతేడాది ఏప్రిల్ 24న ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెగ్యులర్ డీఆర్ లేక అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ స్థానానికి ఇన్‌చార్జ్‌గా ఆడిట్ డీఆర్ అనిల్‌కుమార్‌ను నియమించారు. ఈయన కూడా ఈ ఏడాది మే 31న పదవీ విరమణ పొందారు.

దీంతో కర్నూలు డీఆర్ స్థానంతోపాటు ఆడిట్ డీఆర్ స్థానం ఖాళీ అయింది. నంద్యాల డీఆర్‌గా అబ్రహం విధులు నిర్వహిస్తూ ఆరునెలల క్రితం ఒంగోలు డీఆర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో రెండు డీఆర్, ఒక ఆడిట్ డీఆర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కర్నూలు డీఆర్, ఆడిట్ డీఆర్  ఇన్‌చార్జ్ బాధ్యతలను డిఐజీ గిరిబాబుకు, నంద్యాల డీఆర్ ఇన్‌చార్జ్ బాధ్యతలు ప్రొద్దుటూరు డీఆర్ గంగిరెడ్డికి అప్పగించారు.
 
 ఇద్దరు జూనియర్  అసిస్టెంట్ల  హల్‌చల్
 డీఐజీ, డీఆర్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హల్‌చల్ చేస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో అధిక సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు బుద్ధిగా విధులు నిర్వహించాల్సిన వారు రోజూ కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి  డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, డీఐజీ గిరిబాబుల పేర్లు వినియోగిస్తూ హడావుడి చేస్తూ బంధువులకు, స్నేహితులకు ఆగమేఘాల మీద పనులు చేసిపెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తూ తమ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు.

 వీరితో పాటు ఓ సబ్ రిజిస్ట్రార్ తనకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బాగా తెలుసు.. తన మాట వినకుంటే మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేయిస్తానంటూ ఉద్యోగులను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. తన పేరును ఎవరు వాడుకున్నా సహించేది లేదని ఫిర్యాధిదారులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఫిర్యాదిదారులు మాజీ మంత్రి మూలింటి మారెప్ప దృష్టికి తీసుకురావడంతో ఆ ఇద్దరి జూనియర్ అసిస్టెంట్లతో పాటు, ఆ సబ్ రిజిస్ట్రార్‌పై కూడా చర్యలు తీసుకుని ట్రాన్స్‌ఫర్ చేయండి అంటూ  మారెప్ప డీఐజీకి ఫిర్యాదు చేశారని తెలిసింది. సాక్ష్యాత్తు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఆ శాఖ బాధ్యతలు ఉండడంతో ఆయన ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement