కాంగ్రెస్ పార్టీకి మాగుంట రాజీనామా | magunta srinivasula reddy resigned to congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీకి మాగుంట రాజీనామా

Feb 20 2014 2:29 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి  కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖను ఆయన బుధవారం పత్రికలకు విడుదల చేశారు. లోక్‌సభలో ఈనెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విడగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

 40 ఏళ్లుగా తమ కుటుంబానికి కాంగ్రెస్‌తో అనుబంధం ఉందని అన్నారు. రాజీవ్‌గాంధీ స్ఫూర్తితో తన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. తమ కుటుంబం ఆరు సార్లు లోక్‌సభకు, రెండుసార్లు శాసనసభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిందని అన్నారు. తెలంగాణ  ఏర్పాటుకు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోగానే సీమాంధ్ర అగ్ని గుండ మైందని,  దాంతో తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. సీమాంధ్రుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

 పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయలేదు:
 కొన్ని టీవీ చానెళ్లలో మాగుంట రాజీనామాను లోక్‌సభ స్పీకరు ఆమోదించినట్లు వార్తలు రావడంపై ఒంగోలులోని  ఆయన కార్యాలయం ఖండించింది. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేశారని తెలిపింది. గతంలో ఆయన చేసిన రాజీనామాను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement