లింగవరం ఆనవాళ్లు బృహత్‌ శిలాయుగానివే | Lingavaram landmarks at 4,000 years ago | Sakshi
Sakshi News home page

లింగవరం ఆనవాళ్లు బృహత్‌ శిలాయుగానివే

May 31 2017 2:26 AM | Updated on Sep 5 2017 12:22 PM

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం లింగవరం గ్రామంలో

వెంకటగిరి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం లింగవరం గ్రామంలో గతంలో లభించిన చారిత్రక ఆనవాళ్లు 4,000 సంవత్సరాలకు పూర్వం బృహత్‌ శిలాయుగపు కాలానికి చెందినవిగా వెంకటగిరికి చెందిన షేక్‌ రసూల్‌ అహ్మద్‌ తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. లింగవరంలో ఇటీవల పురాతన మట్టి పాత్రలు లభించడంతో ఆ గ్రామాన్ని తమ బృందంతో కలసి పరిశీలించినట్లు తెలిపారు. గ్రామానికి ఉత్తరంగా ఉన్న 50 ఎకరాల ఇసుక దిబ్బల్లో ప్రాచీన మానవుని నివాస, ఖనన స్థలాలను గుర్తించామన్నారు.

ఇసుక దిబ్బ కింద పదుల సంఖ్యలో పెద్ద, చిన్న మట్టి కుండలు లభించినట్లు వివరించారు. రెండున్నర అడుగులున్న ఓ మట్టి కుండలో చిన్న టెర్రాకోట మూతలతో మూసి ఉన్న చిన్న మట్టి కుండలు ఎర్రటి, నల్లటి రంగుల్లో ఉన్నాయని తెలిపారు. దిగువ భాగాన మానవ అస్థికలు ఊకరూపంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎర్రటి పెద్ద మట్టి కుండ పైభాగంలో జంతువుల బొమ్మలు చిత్రించి ఉన్నాయని, ఇవి ఆనాటి కళాత్మక పని తీరుకు నిదర్శనమన్నారు. మరికొంత దూరంలో పెద్ద రింగ్‌వాల్‌ మృతుల బావిని సూచిస్తుందన్నారు. 
 
శ్మశానానికి దగ్గరలో నివాస స్థలాలు: కండలేరు ఉప్పకాలువకు సమీపంలో ఉన్న ఈ ప్రాచీన శ్మశానానికి దగ్గర్లో నివాస స్థలాలు ఉన్నాయని, ఒకప్పుడు ఈ ప్రాంతం పట్టణ కేంద్రంగా ఉండొచ్చ నని రసూల్‌ అహ్మద్‌ అభిప్రాయపడ్డారు. ఇక్కడి మట్టి, ఇటుకలను గృహ నిర్మాణాల కోసం స్థానికులు ఉపయోగించి ఉండవచ్చన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇసుక ప్రాంతంలో ప్రాచీన మానవుడి జాడలు కనుగొన్నప్పటికీ పురావస్తుశాఖగా ని, ప్రభుత్వంగాని తగు చర్యలు తీసుకోకపోతే గొప్ప చారిత్రక స్థలం ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement