రాష్ట్రాన్ని విభజించవద్దు.. సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఏపీ ఎన్‌జీఓలు హైదరాబాద్‌లో శనివారం నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటామని టీజేఏసీ నాయకులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి/మానవపాడు : రాష్ట్రాన్ని విభజించవద్దు.. సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఏపీ ఎన్‌జీఓలు హైదరాబాద్‌లో శనివారం నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటామని టీజేఏసీ నాయకులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టి వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మహబూబ్‌నగర్‌తో పాటు జడ్చర్ల, వనపర్తి, షాద్‌నగర్, నారాయణపేట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున శాంతిర్యాలీలు నిర్వహించారు. అంతేకాకుండా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను అడ్డుకునేందుకు టీజేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా సరిహద్దు అలంపూర్ టోల్‌గేట్ వద్ద గద్వాల డీఎస్పీ గోవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనుమానితులను ప్రశ్నిస్తూ అక్కడి నుంచి తరిమేస్తున్నారు. షాద్‌నగర్ వరకు ఉన్న జాతీయ రహదారిపై విసృ్తతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు అక్కడక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బందోబస్తు కోసం మూడు ప్లటూన్ల దళాలను రంగంలోకి దింపారు. తెలంగాణ ప్రాంతం వారు సభలు నిర్వహించినప్పుడు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలు సమైక్యసభ నిర్వహించుకునేందుకు నాలుగు రోజుల ముందే అనుమతి ఎలా ఇస్తార ని టీజేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
నాయకుల కదలికలపై నిఘా
తెలంగాణలో సీమాంధ్ర పెత్తనం సాగనివ్వమని మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరబ్రహ్మచారి హెచ్చరించారు. టీజేఏసీ పిలుపునిచ్చిన బంద్‌కు టీఆర్‌ఎస్ కూడా మద్దతు ప్రకటించడంతో అక్కడక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా నాయకుల కదలికలపై నిఘా ఉంచాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇదిలాఉండగా తెలంగాణ ప్రజలపై శత్రుదేశం మాదిరిగా సీమాంధ్ర ప్రజలు దండయాత్ర చేసేందుకే ఏపీఎన్‌జీఓలు సభ నిర్వహిస్తున్నారని కొల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను సక్సెస్ చేసేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి దగ్గరుండి కార్యక్రమాలు నడిపిస్తున్నారన్నారు. బంద్ ద్వారా వీరి ఆగడాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అయితే బంద్‌కు కాంగ్రెస్‌తోపాటు టీడీపీ, బీజేపీలు మద్దతు ప్రకటించకపోవడంతో గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా గతంలో నిర్వహించిన సడక్‌బంద్ విజయవంతం కాకుండా వ్యూహాత్మకంగా అడ్డుకోగలిగామని అదే స్ఫూర్తితో పనిచేసి జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గట్టిచర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి.