పేదలకు ఇళ్ల స్థలాలు రెడీ 

Land Ready For Distribute Poor People in Vijayawada - Sakshi

నగరంలో 1.05 లక్షల మంది లబ్ధిదారులు 

నగర పరిసర గ్రామాల్లో 1,333.5 ఎకరాల్లో 70,680 ప్లాట్లు సిద్ధం 

మిగిలిన వారికి రాజధాని ప్రాంతంలో కేటాయింపు 

టీడీపీ నేతలకు కంటగింపు 

అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చనుంది. వాస్తవంగా ఈ నెల 8నే ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొందరు స్వార్ధపరులు కోర్టుకు వెళ్లడంతో చివరి నిముషంలో ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 15కు వాయిదా వేశారు. 

సాక్షి, విజయవాడ: నగరంలో ఇళ్ల స్థలాల కోసం 1.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1.05 లక్షల మంది అర్హులని నగర పాలక సంస్థ గుర్తించింది. వీరందరికీ ఇళ్ల స్థలాలు నగర పరిసర గ్రామాల్లోనూ, రాజధాని గ్రామాల్లోనూ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలనే లక్ష్యంతో గడువు దాటిన తరువాత వచ్చిన  దరఖాస్తులను కూడా తీసుకుని వారికీ ఇళ్లు కేటాయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.   

నగర పరిసర గ్రామాల్లో 1,333.59 ఎకరాల్లో 70,680 ప్లాట్లు సిద్ధం
పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను జిల్లా రెవెన్యూ అధికారులు సేకరించారు. సెంటు ప్లాటు చొప్పున విడగొట్టి సిద్ధం చేశారు. మొత్తం 1,333.59 ఎకరాల్లో 18 లేఅవుట్లలో 70,680 ప్లాటు సిద్ధంగా ఉన్నాయి. విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో 85.56 ఎకరాల్లో 4,535 ప్లాట్లు, ఇబ్రహీంపట్నం కొండపల్లిలో 40.72 ఎకరాల్లో 2,158 ప్లాట్లు,  పెనమలూరు మండలం వణుకూరులో 155.07 ఎకరాల్లో 8,219 ప్లాట్లు, గన్నవరం మండలం సూరంపల్లి,  కొండపావులూరుల్లో 396.66 ఎకరాల్లో 21,023 ప్లాట్లు, జి కొండూరు మండలం మునగపాడు, సున్నంపాడు గ్రామాలలో 521.22 ఎకరాల్లో 27,625 ప్లాట్లు, కంకిపాడు మండలం గొడవర్రులో 134.36 ఎకరాల్లో 7,121 ప్లాట్లు సిద్ధంచేశారు. ఆయా ప్లాట్ల మధ్యలో విశాలమైన రోడ్లు వేశారు. ఏ బిట్‌కు ఆ బిట్‌ విడగొట్టి సర్వే రాళ్లు పాతి లబ్ధిదారులు చూసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు.  

టీడీపీ నేతలకు కంటగింపు
మిగిలిన వారికి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఒకేసారి నగరంలో లక్ష కుటుంబాలకు ఇళ్ల స్థలాలు వస్తే టీడీపీ పార్టీ ముఖం చూసేవారే కరువవుతారనే కంటగింపు ఆ పార్టీ నేతల్లో ఏర్పడింది. దీంతో ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు  నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదంటూ అక్కడ రైతులతో కోర్టులో కేసులు వేయించారు. ఇక రైతుల నుంచి సేకరించిన భూమిని పేదలకు దక్కకుండా కోర్టులలో కేసులు దాఖలు చేయిస్తున్నారు. వీరి ప్రయత్నాలన్నీ తాత్కాలికమే.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి.  

పేదల ఎదురు చూపులు
ఇప్పటికే రెండు సార్లు టీడీపీ నాయకులు అడ్డుపడటాన్ని పేదలు గమనిస్తున్నారు. వారి వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top