నిమ్మాడలో నియంత ఆగడాలు

Kinjarapu Achennayudu Doing Social In-discrimination In Nimmada - Sakshi

అనుకూలంగా లేని కుటుంబాల సామాజిక బహిష్కరణ

చావు పుట్టుకల నుంచి ప్రతి కార్యక్రమానికి వెలివేత

సంవత్సరాల తరబడి 26 కుటుంబాలకు అష్టకష్టాలు

సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): ఇవే మా భూములు.. బహిష్కరణ వలన పంటలు పండించుకోలేక బీడుగా మారాయి.. మా గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు సుమారు 18 ఎకరాల భూములున్నాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం మంత్రి కుటుంబానికి ఎదురు తిరిగామన్న కక్షతో 26 కుటుంబాలను బహిష్కరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడితోపాటు ఆయన సోదరుడు ప్రసాద్‌ మాపై కక్ష కట్టారు. 6 సంవత్సరాలుగా పంటలు పండించుకోనివ్వడం లేదు. నా భూములను తక్కువ ధరలకు లాక్కోవాలని చూస్తున్నారు. ఆ బాధలకు తాళలేక గ్రామానికి కొంత దూరంలో నివసిస్తున్నాను. 

ఇది నిమ్మాడకు చెందిన మెండ రామ్మూర్తి అనే బాధితుడి ఆవేదన. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడి నిరంకుశత్వానికి ఇలాంటి ఉదాహరణలెన్నో.. వారి కుటుంబానికి ఎదురు తిరిగినందుకు బయట ప్రపంచానికి తెలియకుండా సంవత్సరాల తరబడి సామాజిక బహిష్కరణ చేశారు. వారి ఇళ్లల్లో చావు పుట్టుకలకు ఎవరూ వెళ్లకూడదు. రజకులు, నాయిబ్రాహ్మణుల వంటి కులవృత్తులవారు వారి పనులు చేయకూడదు. చివరకు వారి పంట పొలాల్లో పనులకు సైతం కూలీలు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సంవత్సరాల తరబడి పంట భూములు బీడుగా మారిపోయాయి.

బాధితులు మూడు పూటలా తిండి కోసం విలవిలలాడుతున్నారు. చివరకు రేషన్‌ బియ్యం కూడా ఇవ్వకుండా చేస్తున్నారంటే ఇక్కడ ఎటువంటి పాలన కొనసాగుతుందో అర్థమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు సంవత్సరాల తరబడి సుమారు 26 కుటుంబాలపై ఇదే కక్షసాధింపు చర్యలు జరుగుతున్నప్పటికీ చట్టాలు వారిని ఆదుకోలేకపోతున్నాయి. ఎప్పుడో పాత కాలంలో విన్న ఇటువంటి ఆటవిక చర్యలు సాక్షాత్తు మంత్రి సొంత గ్రామంలోనే జరుగుతున్నప్పటికీ ప్రశ్నించే అధికారులు కానరావడం లేదు.

నేనున్నాను..
మంత్రి రాక్షస పాలన నుంచి తమను రక్షించే దేవుడెప్పుడు వస్తాడని బాధితులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో బాధితులు కొంతమంది తమ గోడును వివరించారు. నిమ్మాడలో జరుగుతున్న ఆటవిక పాలన గురించి తెలుసుకున్ని వైఎస్‌ జగన్‌ నివ్వెరపోయారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

అన్యాయంగా కేసుల్లో ఇరికించాలని చూశారు
మమ్మల్ని గ్రామంలోనే వెలివేశారు. అన్యాయంగా కేసుల్లో ఇరికించాలని చూశారు. పంటలు పండిస్తామనుకుంటే అడ్డు తగులుతున్నారు. మంత్రి, ఆయన సోదరుడికి భయపడి ఎవరూ మాకు అండగా నిలవడం లేదు. 
–కాళ ఆదినారాయణ, బాధితుడు, నిమ్మాడ

నిమ్మాడలో అరాచక పాలన
మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు కలిసి నిమ్మాడలో అరాచక పాలన కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఆటవిక పాలన పురాణాల్లో చదువుకున్నాం. బాధిత ప్రజలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
–దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్‌ సీపీ నాయకుడు

గుణపాఠం చెప్పాలి
నిమ్మాడలో నియంత పాలన కొనసాగుతోంది. మంత్రి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన సోదరునితో రౌడీ పాలన కొనసాగిస్తున్నారు. మంత్రికి తగిన గుణపాఠం చెప్పి బాధితులకు ఆదుకోవాలి.
–పేరాడ తిలక్, వైఎఎస్సార్‌ సీపీ నాయకుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top