మంత్రి పీఎస్ హల్‌చల్....


చీపురుపల్లి:   రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, హౌసింగ్ శాఖా మంత్రి కిమిడి మృణాళిని పర్యటనలు, వ్యవహారాలు చూసుకోవాల్సిన ఆయన ఒక్కసారిగా మంత్రిగా పరకాయప్రవేశం చేశారు.  తానే మంత్రినైనట్టు రాష్ట్ర మంత్రి మృణాళిని పర్సనల్ సెక్రటరీ  రామకృష్ణ వ్యవహరించారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రి పీఎస్ తనిఖీలు చేసి, ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.    మంత్రి మృణాళినితో ఫాలో అవ్వాల్సిన ఆమె పర్సనల్ సెక్రటరీ రామకృష్ణ, మంత్రి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ వాహనంలో శుక్రవారం చీపురుపల్లి వచ్చి హల్‌చల్ చేశారు.  పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీరింగ్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి, అక్కడే ఉన్న నీటి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ డిప్యూటీ   ఇంజినీర్  కార్యాలయంతో పాటు ప్రాజెక్ట్స్ కార్యాలయంలో ఏకంగా సాంకేతిక రికార్డులను, అటెండెన్స్   రిజిస్టర్లను  పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.సాంకేతిక అనుమతులు రిజిస్టర్లలో గత నెలకు సంబంధించిన పనులకు  వివరాలను ఎందుకు పూర్తిగా నమోదు చేయలేదని అధికారులను నిలదీసినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా జిల్లా పరిషత్ సీఈఓ రాజకుమారి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ, ఈఈలకు అక్కడి నుంచి ఫోన్ చేసి, స్పీకర్ ఆన్‌చేసి చీపురుపల్లి డిప్యూటీ పంచాయతీరాజ్  విభాగం పరిస్థితి ఏమీ బాగాలేదని, దృష్టి పెట్టాలని సూచించారు. అంతకుముందు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం గురించి ఆరా తీశారు.వారానికి ఎన్ని గుడ్లు పెడుతున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కూడా పరిశీలించినట్లు తెలిసింది. అయితే మంత్రి పీఎస్ చర్యలుపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ అధికారుల్లో చర్చ మొదలయ్యింది. ఈ విషయమై ఏకంగా మంత్రి మృణాళినితోనే మాట్లాడేందుకు ఇంజినీరింగ్ అదికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top