మా సభలకొచ్చిన డ్రైవర్లంత మంది లేరు: కేసీఆర్ | KCR mocks APNGOs meeting | Sakshi
Sakshi News home page

మా సభలకొచ్చిన డ్రైవర్లంత మంది లేరు: కేసీఆర్

Sep 11 2013 3:49 AM | Updated on Aug 15 2018 8:06 PM

ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ గొప్పదేమీ కాదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు.

సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ గొప్పదేమీ కాదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన టీ ఉద్యోగుల గర్జనకు హాజరైన ఉద్యోగులను తీసుకొచ్చిన వాహనాల డ్రైవర్లంతమంది కూడా ఈ సభకు రాలేదని ఎద్దేవా చేశారు. ఈ సభతో బ్రహ్మాండం బద్దలైందని ఎవరైనా అనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాక నగరానికి చేరుకున్న కేసీఆర్ సోమవారం పార్టీ నేత కే కే నివాసంలో టీఆర్ ఎస్, జేఏసీ, తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సేవ్ ఆంధ్రప్రదేశ్ వంటి సభల్ని తాము గతంలో లక్షలు, వేలు నిర్వహించామని చెప్పారు. ఉద్యోగుల గర్జన సభలకు వచ్చిన  5-6లక్షల మంది ఉద్యోగులను తీసుకువచ్చినంత మంది కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు హాజరుకాలేదని విమర్శించారు.
 
 ఆఫ్ట్రాల్ ఒక సభ పెట్టినవారు ఆ సందర్భంగా వ్యవహరించిన దుర్మార్గపు, జుగుప్సాకర, అసభ్యరీతిని చూసి సమాజం నవ్వుకోవడంతోపాటు జాలిపడుతోందన్నారు. 13 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా వ్యవహరించామని వాల్‌స్ట్రీట్, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియాతోపాటు జాతీయ మీడియాలు ఉట ంకించాయని చెప్పారు. తన ఢిల్లీ పర్యటనలో కలిసిన పెద్దలతో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీన సమయంలో ఉన్న తెలంగాణను ప్రకటించాలని కోరుతూ ఆ పత్రాలు, వివరాలు అందజేసినట్లు చెప్పారు. ఎలాంటి ఆంక్షల్లేని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలనేదే తెలంగాణ ప్రజల, జేఏసీ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
 
 2009లో వలే మరోమారు తెలంగాణ అడ్డుకోవాలనే వారివి పగటికలలేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ఇప్పటికే లక్షల దూషణలు చేశారని వాటిని భరించినట్లే భవిష్యత్తులోనూ ఇంకో లక్ష తిట్లైనా భరిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలోవలే సీమాంధ్రలోనూ టీడీపీ డిపాజిట్లు కోల్పోవడం తప్పదన్నారు. అధికారంకోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు తెలంగాణలో ఒకమాట... సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు విమర్శించారు. పీఆర్పీ ఏర్పాటు సమయంలో సామాజిక తెలంగాణను ప్రతి పాదింపచేసిన డాక్టర్ మిత్ర ఉచితంగా వేదిక దొరికిందని ఇష్టంవచ్చినట్లు మాట్లాడారని పార్టీ నేత నర్సయ్యగౌడ్ ధ్వజమెత్తారు. దాడి చేసినవారిపైగాక దాడికి గురైన వారిపై కేసులు పెట్టడం ఏమిటని ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. భేటీలో పార్టీ నేతలు కేకే, కడియం శ్రీహరి, వేణుగోపాలచారి, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్, జేఏసీ నేతలు కోదండరాం, విఠల్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement