బాలికలకు భరోసా

kasthurba Gandhi Girls Schools in Prakasam - Sakshi

పేద విద్యార్థినుల పాలిట వరంగా మారిన కస్తూరిబా గాంధీ విద్యాలయాలు

ప్రత్యేక సౌకర్యాలతో నాణ్యమైన విద్య

ప్రవేశానికి ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి

ప్రకాశం, మార్కాపురం:  గ్రామీణ ప్రాంతాలకు చెందిన బడి ఈడు పిల్లలకు, బడి మానేసిన బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయాలు (కేజీబీవీలు) వారి పాలిట వరంగా మారాయి. 2007 నవంబర్‌ 14న జిల్లాలో 37 కస్తూరిబా పాఠశాలలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మార్కాపురం మండలం రాయవరం వద్ద కస్తూరిబా గాంధీ పాఠశాలను ఏర్పాటు చేశారు. కస్తూరిబా పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి బాలికల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బడి మానేసిన, బడి ఈడు పిల్లలను ఉపాధ్యాయులు సర్వే నిర్వహించి గుర్తిస్తుంటారు. వారిలో బాలికలను సమీప గురుకుల విద్యాలయాల్లో చేర్పించాలని ప్రత్యేక అధికారులకు సర్వే నివేదికలు అందాయి.

కస్తూరిబా పాఠశాలల్లో ఇవీ ప్రత్యేకతలు...
కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయాల్లో బాలికలకు ఉచిత విద్యతో పాటు ఉచిత వసతి అందిస్తుంటారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, పెట్టెలు ఉచితంగా అందజేస్తారు. అలాగే కాస్మోటిక్‌ కిట్లను అందజేస్తారు. రోజూ ఉదయం పాలతో పాటు టిఫిన్, సాయంత్రం చిరుతిళ్లు, గురు, శనివారాల్లో తీపి పదార్థాలు, శని, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో కోడిగుడ్డుతో తయారు చేసిన కర్రీ ఇస్తారు. ప్రస్తుతం 6వ తరగతిలో ప్రవేశం పొందితే 10వ తరగతి వరకు చదువుకోవచ్చు. ఇంటర్మీడియెట్‌ను ప్రవేశపెడితే అదనంగా మరో రెండేళ్లు చదువుకోవచ్చు.

ప్రాధాన్యత ప్రకారం ఎంపిక...
కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు మొదట బడిమానేసిన పిల్లలు, తల్లిదండ్రులు లేని చిన్నారులు, ఎస్సీ, ఎస్టీ వారికి ప్రాధాన్యత ఇస్తారు. పాఠశాలలో చేరేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. జిల్లాలో మార్కాపురం డివిజన్‌లోని రాయవరం, బేస్తవారిపేట, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, అర్ధవీడు, గిద్దలూరు, కొమరోలు, కొనకనమిట్ల, పుల్లలచెరువు, పెద్దదోర్నాల, పెద్దారవీడు, రాచర్ల, తర్లుపాడు, పొదిలి, కందుకూరు డివిజన్‌లోని సీఎస్‌ పురం, హెచ్‌ఎం పాడు, దర్శి, దొనకొండ, కురిచేడు, లింగసముద్రం, పామూరు, వెలిగండ్ల, వలేటివారిపాలెం, జరుగుమల్లి, పొన్నలూరు, కందుకూరు, కనిగిరి, మర్రిపూడి, ముండ్లమూరు, చీరాల డివిజన్‌లోని చిన్నగంజాం, సంతమాగులూరు, చీరాల, దర్శి, కొత్తపట్నం, తదితర ప్రాంతాల్లో కేజీబీవీలు ఉన్నాయి.

ఈ ఏడాది నుంచికొన్నిచోట్ల ఇంటర్‌ కోర్సులు...
ఈ ఏడాది నుంచి జిల్లాలోని మార్కాపురం, పుల్లలచెరువు, పెద్దారవీడు, హెచ్‌ఎం పాడు, బల్లికురవ, కురిచేడు, చినగంజాం, వలేటివారిపాలెం, కొమరోలు కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్‌ కోర్సులు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

నాణ్యమైన విద్య అందిస్తున్నాం
కస్తూరిబా గాంధీ విద్యాలయంలో బాలికలకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. మంచి భోజన వసతి ఉంది. విద్యార్థి ఆధార్‌ నంబర్లు, తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్లు తీసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. క్రీడలపై శిక్షణ ఇస్తున్నాం. వ్యర్థ వస్తువులతో వివిధ రకాల ఆకృతులు తయారు చేసే విధానంపై శిక్షణ ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌ ప్రారంభిస్తున్నాం.– విజయలక్ష్మి, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top