‘పచ్చ’ నేత అండతో మహిళలతో అసభ్యకర చాటింగులు

Kakinada Rural is a Retired Employee Abusing a Woman - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఓ మహిళపై విశ్రాంత ఉద్యోగి వేధింపులకు పాల్పడుతుండగా ... ఈయనకు ‘పచ్చ’ రాజకీయం అండదండలిస్తోంది. అధికారులను ఆటబొమ్మలుగా మార్చేసి అంతా తానై చక్రం తిప్పుతున్న ఆయన మహిళలను మానసిక వ్యథకు గురిచేసే వ్యక్తిని వెనుకేసుకురావడాన్ని నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

ఈ షాడో నేతకు ఒక సలహాదారుడిగా ఈ రిటైర్డ్‌ అధికారి వ్యవహరిస్తుంటాడు. అవినీతి ఎలా చేయాలన్న దర్గరనుంచి ఎక్కడ భూములు కబ్జాలు చేయాలో గుర్తించి మరీ చెబుతాడు. నియోజకవర్గ కీలక నేత తన కనుసన్నల్లో ఉన్నాడనో...ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనో తెలియదు గానీ ఆడపిల్లలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. ఆ మహిళల ప్రమేయం లేకుండా వారి నెంబర్ల వాట్సాప్‌ల ద్వారా అసభ్యకరంగా చాటింగ్‌ చేస్తున్నాడు.  ఆ మధ్య ఒక యానిమేటర్‌తో చేసిన చాటింగ్‌ వ్యవహారం బయటపడి రచ్చరచ్చ అవుతోంది. 

ఆయనొక రిటైర్డ్‌ అధికారి. రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని ఓ మండలంలో పనిచేశాడు. ఉద్యోగంలో ఉండగానే నియోజకవర్గ షాడో నేతకు అండగా నిలిచాడు. షాడో నేత ఏది చెబితే అదే చేసేవాడు. ఇద్దరూ కలిపి పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఆ నేతకొక కార్యకర్తలా పనిచేశాడు. ఎవరికే పథకం ఇవ్వాలి? ఎవరికి ఏ లబ్ధి చేకూర్చాలనే సలహాల నుంచి ఎక్కడేవిధంగా దోపిడీ చేయాలో కూడా సదరు నేతకు ఈ అధికారి సూచించేవాడు. ఆ విధంగా కార్యాచరణ అమలు చేసేవారు.

ఇక, రిటైరయ్యాక ముసుగు తొలగించి ఏకంగా ఆ షాడో నేతకు సలహాదారునిగా, సన్నిహితుడిగా ఉండిపోయాడు. ఇదంతా నాణెంకు ఒకవైపు అన్నట్టుగా ఈయనకు మరో కోణం కూడా ఉంది. ఆయన వయస్సుకు, చేష్టలకు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నాడు. అవసరాల నిమిత్తం వచ్చే మహిళలను ట్రాప్‌ చేసే దుర్బుద్ధి ఉండడంతో వారి వద్దనుంచి ఫోన్‌ నెంబర్లు తీసుకుని సాయంత్రమయ్యాక చాటింగులు చేయడం ప్రారంభించాడు. అసభ్యకర సందేశాలతో...వీడియోలు, ఫొటోలతో ఓ యానిమేటర్‌ వాట్సాప్‌కు పంపించి నరకం చూపించాడు.

ఎవరికి చెప్పుకోలేక...అలా అని మౌనం దాల్చలేక మానసిక వేదనకు ఆమె గురయ్యింది. ఎవరికైనా చెబుతామంటే పరువు పోతుందని... దానికితోడు నియోజకవర్గంలో కీలక నేతకు సన్నిహితుడిగా ఉండటంతో ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని తనలోనే కుమిలిపోయిందామె. ఈ చాటింగ్‌ క్లిప్పింగులు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈయనతోపాటు ఈయన్ని సమర్ధించే ఆ షాడో నేతను నియోజకవర్గ ప్రజలు ఈసడించుకుంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top