కాండ్రేగులలో ఇద్దరికి డెంగీ

Kakinada Rdo Raghu Babu Visit Dengue Areas East Godavari - Sakshi

మరో ఇద్దరికీ అవే లక్షణాలు

కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు

32 మందికి వైరల్‌ జర్వాలు

గ్రామాన్ని సందర్శించిన కాకినాడ ఆర్డీఓ రఘుబాబు

కొనసాగుతున్న వైద్య శిబిరం

పెదపూడి (అనపర్తి): మండలంలోని కాండ్రేగుల గ్రామంలో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయని సంపర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు బీవీవీ సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నురుకుర్తి శ్రీను, వేమగిరి వెంకటరమణ అనే వారు డెంగీ జ్వరంతో చికిత్స పొందుతున్నారన్నారు. కాండ్రేగుల గ్రామంలో మరో 32 మంది వైరల్‌ జ్వరాలతో బాధపడు తున్నారన్నారు. వారికి రక్త పరీక్షలు నిర్వహించగా, పి.గంగాధర్, ఎన్‌.ఈశ్వరరావు అనే మరో ఇద్దరికి కూడా డెంగీ లక్షణాలు ఉన్నట్టు అనుమానంగా ఉందన్నారు. వారిని కూడా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలిస్తున్నామన్నారు. గ్రామంలో  ఈ నెల 10వ తేదీ నుంచి వైరల్‌ జ్వరాలు వ్యాపించాయని చెప్పారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు ఇచ్చి, రక్త పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటికీ గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతోందన్నారు. అలాగే జిల్లా మలేరియా అధికారి తులసి గ్రామంలో పర్యటించారు. 

అప్రత్తంగా ఉండాలి: ఆర్డీఓ రఘుబాబు
కాండ్రేగుల గ్రామంలో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వైరల్‌ జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కాకినాడ ఆర్డీఓ ఎల్‌.రఘబాబు ఆదేశించారు. కాండ్రేగుల గ్రామంలో వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న కుటుంబాలను మంగళవారం ఆయన పరామర్శించారు .వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగీ లక్షణాలున్న నక్కా ఈశ్వరరావుతో ఆర్డీవో మాట్లాడారు. తక్షణం కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని ఆదేశించారు. అలాగే సోమవారం రాత్రి చనిపోయిన ఎనిమిది నెలల శిశువు నాగశివలోహిత్‌  వివరాలను బంధువులను, వైద్యుడ్ని అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ నాగశివలోహిత్‌కు మూడు రోజులు క్రితం జ్వరం వచ్చిందన్నారు. జ్వరం తగ్గిన తర్వాత కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫిట్స్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యలు చెప్పారన్నారు. అనంతరం రాత్రి ఫిట్స్‌ రావడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, కొద్ది సేపటికే చనిపోయాడని వారు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కాండ్రేగుల గ్రామంలో జరిగే ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెలియజేయాలన్నారు. ఎంపీడీఓ కె.హరికృష్ణ సత్యరెడ్డి మాట్లాడుతూ  గ్రామంలో గత వారం రోజులుగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచామన్నారు.

డెంగీతో ఆస్పత్రిలో చేరిన మహిళ
కడియం (రాజమహేంద్రవరం రూరల్‌): మండలంలోని దుళ్ళ వినాయకుడి కాలనీకి చెందిన యు.సూర్యావతి డెంగీ జ్వరంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న సూర్యావతిని రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు డెంగీగా నిర్ధారించి వైద్యమందిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా మహిళకు డెంగీ వ్యాధిగా నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది మంగళవారం హడావుడిగా కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అడిషనల్‌ డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ పి.కోమలి శిబిరాన్ని సందర్శించి కాలనీ వాసులతో మాట్లాడారు. వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే చేపట్టారు. అయితే చికిత్స పొందుతున్న మహిళ కుటుంబ సభ్యులతో పాటు ఇతరులెవ్వరు జ్వరాలతో లేరని సిబ్బంది చెబుతున్నారు. దోమల లార్వాలను సేకరించారు. కాగా ఎంపీడీఓ కె.రత్నకుమారి, ఈఓపీఆర్‌డీ వైవీఎస్‌ లక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అశోక్, సిబ్బంది శిబిరాన్ని సందర్శించారు. తక్షణం కాలనీలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చాలని పంచాయతీ సెక్రటరీ పి. సుబ్బారావును అధికారులు ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top