ఒడ్డుకు ‘వశిష్ట’

Kachuluru Boat Operation was Successfully completed - Sakshi

గోదావరిలో ముగిసిన బోటు ఆపరేషన్‌ 

తీవ్రంగా శ్రమించిన ధర్మాడి బృందం

డీప్‌ డైవర్లతో కలసి పట్టు వదలకుండా అన్వేషణ

బోటు వెలికితీతపై అన్ని ప్రయత్నాలకు సహకరించిన ప్రభుత్వం

సాక్షి, కాకినాడ/దేవీపట్నం/రంపచోడవరం: నిండు గోదావరిలో 38 రోజులుగా సాగుతున్న అన్వేషణకు తెరదించుతూ రాయల్‌ వశిష్ట బోటు మంగళవారం ఒడ్డుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద సెప్టెంబర్‌ 15వ తేదీన గోదావరిలో మునిగిన రాయల్‌ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి మధ్యాహ్నం సమయంలో ఒడ్డుకు తరలించింది. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్‌ వాటర్‌ సర్వీస్‌కు చెందిన పది మంది డీప్‌ డైవర్స్‌ కూడా ధర్మాడి బృందంతో కలసి పనిచేశారు. నీట మునిగిన రాయల్‌ వశిష్ట బోటులో 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. 

ఆపరేషన్‌ ఇలా ..
బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి వెలికి తీసేందుకు నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా శ్రమించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. చివరకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్‌ నిర్వాహకుడు ధర్మాడి సత్యానికి రాయల్‌ వశిష్ట వెలికితీత పనులను రూ. 22.70 లక్షలకు అప్పగించారు. ప్రమాదానికి గురైన సమయంలో గోదావరిలో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కచ్చులూరు మందం వద్ద ఆ సమయంలో గోదావరిలో 300 అడుగుల లోతు నీరు  ఉంది. ధర్మాడి బృందం 25 మంది సభ్యులతో సంప్రదాయ పద్ధతిలో బోటు వెలికితీత పనులు ప్రారంభించింది. బోటు లంగరుకు చిక్కినట్టే చిక్కి జారిపోయినా పట్టు వీడలేదు. పలు దఫాలు విఫలమైనా ప్రయత్నాలు కొనసాగించింది. 

ధ్వంసమైన బోటు...
మట్టి, ఒండ్రులో చిక్కుకుపోవడంతో సోమవారం బోటు పైకప్పు మాత్రమే ఊడి వచ్చింది. దీంతో  మంగళవారం మరోసారి ప్రయత్నించారు. బోటు పంటుకు ఇనుప తాడు కట్టారు. ఆరుగురు గజ ఈతగాళ్లు బోటు చుట్టూ తిరిగి వెనుక భాగంలో ఉన్న ఫ్యాన్‌కు లంగరు వేశారు. అనంతరం పొక్లెయిన్‌ సాయంతో భారీ ఇనుప తాడు ద్వారా రాయల్‌ వశిష్ట బోటును గోదావరి నుంచి గట్టుకు తీసుకురాగలిగారు. అయితే ప్రమాదానికి గురైన బోటు పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న మృతదేహాలు పూర్తిగా పాడైపోవడంతో దుర్వాసన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ధర్మాడి సత్యంతోపాటు కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ కచ్చులూరు వద్దే ఉండి బోటు వెలికితీత పనులును పర్యవేక్షించారు. 

దారి కూడా లేని చోటుకు భారీ యంత్రాలు..
బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి వెలికితీత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సంప్రదాయ పద్ధతులను వినియోగించారు. సీఎం జగన్‌ స్వయంగా ప్రతి రోజూ సహాయక చర్యలపై ఆరా తీస్తూ వచ్చారు. మంత్రులను పంపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. దారి కూడా లేని కచ్చులూరు మందానికి భారీ క్రేన్‌ తరలించే ఏర్పాట్లు చేశారు. సీఎం వచ్చి మృతులకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు. చివరి మృతదేహం లభ్యమయ్యే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను సైతం వెంటనే సమకూర్చారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులను పలకరించి కొండంత ధైర్యాన్నిచ్చారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పలు శాఖల అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించి ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించారు.  ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. 

కష్టమే అయినా సమష్టిగా సాధించాం
‘ఆరంభంలో రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత కష్టంగా అనిపించింది. తొలుత ఐరన్‌ రోప్‌ గోదావరిలో తెగిపోయింది. లంగర్లు, ఐరన్‌ రోప్‌లతో ఉచ్చు వేసి పలుమార్లు లాగడంతో నది అడుగు భాగంలో ఉన్న బోటు కొద్దికొద్దిగా ఒడ్డు వైపు వచ్చింది. గోదావరి ఉధృతి పెరగడంతో ఆపరేషన్‌ నిలిచిపోయింది. తరువాత చేపట్టిన ఆపరేషన్‌లో ప్రైవేట్‌ డైవర్లను రంగంలోకి దించాం. మూడు రోజుల పాటు నదిలోకి దిగి బోటుకు రోప్‌ కట్టడంలో విజయం సాధించాం. బోటు ఆపరేషన్‌కు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించింది. అధికారులు, బృందం సభ్యులు, విశాఖ డైవర్ల సమష్టి కృషి ఫలితంగా బోటును ఒడ్డుకు తీసుకు రాగలిగాం’     
– ధర్మాడి సత్యం (బాలాజీ మెరైన్స్‌ యజమాని) 

ఇప్పటిదాకా 46 మృతదేహాలు లభ్యం
రాయల్‌ వశిష్ట బోటులో 77 మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 51 మంది గల్లంతయ్యారు. అందులో 39 మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. తాజాగా బోటు వెలికితీత సమయంలో 7 మృతదేహాలు లభించాయి. మరో ఐదు మృతదేహాల ఆచూకీ తెలియాల్సి ఉంది. 

శభాష్‌ కలెక్టర్‌..
మురళీధర్‌రెడ్డిని అభినందించిన సీఎం
రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత, సహాయక చర్యల పర్యవేక్షణలో చురుగ్గా వ్యవహరించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి, అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఈ మేరకు సీఎం మంగళవారం కలెక్టర్‌కు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో సైతం అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించిందన్నారు.  

ఆ నిర్ణయమే కీలకం!
రంపచోడవరం: గతంలో పలు చోట్ల నీట మునిగిన బోట్లను వెలికి తీసిన అనుభవం ఉన్న ధర్మాడి సత్యం బృందం రాయల్‌ వశిష్ట బోటు వెలికితీతను సవాల్‌గా తీసుకుంది. వెలికితీత ఆపరేషన్‌ 13 రోజులు కొనసాగింది. గోదావరిలో నీటిమట్టం తగ్గడం బోటు వెలికితీతకు అనుకూలంగా మారింది. 50 అడుగుల లోతులో ఉన్న బోటును ఐరన్‌ రోప్‌తో లాగే ప్రయత్నం తొలుత సఫలం కాకపోవడంతో విశాఖపట్నం నుంచి డైవర్స్‌ను రప్పించారు. డైవర్స్‌ నదీ గర్భంలోకి వెళ్లి బోటు అడుగు భాగంలో ఇనుప రోప్‌లు కట్టాలని ధర్మాడి సత్యం బృందం నిర్ణయించడం ఫలితాన్ని ఇచ్చింది.  

ఆపరేషన్‌ ఇలా...
- సెప్టెంబర్‌ 15: రాయల్‌ వశిష్ట బోటు కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయింది. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్‌ సహాయ చర్యలకు ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, హెలికాప్టర్లు, నేవీ, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి.
సెప్టెంబర్‌ 16: ప్రమాద స్థలాన్ని సీఎం వైఎస్‌ జగన్‌  ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతులకు నివాళులు అర్పించి క్షతగాత్రులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 
సెప్టెంబర్‌ 18: కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం దేవీపట్నం చేరుకుని బోటులో కచ్చులూరు మందం వద్ద గోదావరి పరిస్థితిని పరిశీలించింది.  గోదావరి వడి ఎక్కువగా ఉండడంతో బోటు వెలికితీత ప్రక్రియకు దిగలేదు. 
సెప్టెంబర్‌ 30: బోటు వెలికితీతకు ఆపరేషన్‌ రాయల్‌ వశిష్టను ప్రారంభించారు. భారీ ఇనుప తాళ్లు, లంగర్లు సిద్ధం చేసుకున్నారు. 
అక్టోబరు 4: బోటు ఉందని గుర్తించిన ప్రాంతంలో 4 రోజులపాటు లంగర్లు వేసి తెగిపోతున్నా ప్రయత్నం కొనసాగించారు. గోదావరి ఉధృతి పెరగడంతో ఆపరేషన్‌కు విరామం ఇచ్చారు.
అక్టోబర్‌ 15: ధర్మాడి బృందం తిరిగి దేవీపట్నం చేరుకుంది. ఈనెల 16న రాయల్‌ వశిష్ట బోటు ఆపరేషన్‌ –2 తిరిగి ప్రారంభించి ఆచూకీ గుర్తించారు. మొదటి రోజు ఐరన్‌ రోప్‌ ఖాళీగా రావడంతో రెండో రోజు బోటు మునిగిన ప్రాంతంలో ఐరన్‌ రోప్‌ను ఉచ్చుగా వేశారు.
- అక్టోబర్‌ 18: బోటు ముందు భాగంలోని రైలింగ్‌ ఊడి వచ్చింది. 
- అక్టోబర్‌ 19: బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించిన రోప్‌ జారిపోయింది. నదీ గర్భంలో బోటుకు బలమైన రోప్‌ను బిగిస్తేగానీ వెలికి తీసే పరిస్ధితి లేదని ధర్మాడి నిర్ధారణకు వచ్చారు. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్‌ వాటర్‌ సర్వీస్‌కు చెందిన పది డైవర్స్‌ను రంగంలోకి దింపారు. 
అక్టోబర్‌ 20: బోటు ముందు భాగం ఒడ్డువైపునకు 40 అడుగులు, వెనుకభాగం నదివైపు 70 అడుగుల లోతులో పక్కకు ఒరిగి ఒడ్డు ప్రాంతానికి 80 మీటర్ల దూరంలో ఉన్నట్లు డైవర్స్‌ గుర్తించారు. 
అక్టోబర్‌ 21: బోటుకు ఐరన్‌ రోప్‌ కట్టి ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం చేయగా ముందు భాగం కొద్దిగా మాత్రమే ఊడి వచ్చింది.
అక్టోబర్‌ 22: బోటు కింది భాగానికి రోప్‌లు వేసి లాగి ఒడ్డుకు చేర్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top