
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): ‘పాలకులు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతుంటాయని తెలుసు. అయితే వారు వేసిన శిలాఫలకాలు కూడా మారిపోతాయా? దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదికవి నన్నయ యూనివర్సిటీకి భూమిపూజ చేసిన సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని యూనివర్సిటీ ప్రాంగణంలో ఎక్కడా లేకుండా చేయడంలో అర్థం ఏమిట’ని యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడిని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజ మహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ రైతు సూర్యప్రకాశరావు నిలదీశారు. ఈ శిలాఫలకం విషయం తనకు తెలియదన్న వీసీ.. అప్పటినుంచి పనిచేస్తున్న కొంతమంది యూనివర్సిటీ అధికారులను పిలిచి వాకబు చేశారు. అప్పట్లో వీసీగా ఉన్న జార్జివిక్టర్ ఆదేశాల మేరకు 2012లో ఆ పైలాన్‌ను తొలగించారని, శిలాఫలకాన్ని ఏం చేశారో తెలియదని వారు వివరించారు. దీనిపై స్పందించిన వీసీ అసలు శిలాఫలకాన్ని తొలగించడం సరికాదని అన్నారు. ఇంతవరకు తన దృష్టికి ఈ విషయం రాలేదని, పూర్తి వివరాలు ఇస్తే వెంటనే శిలాఫలకాన్ని తయారుచేయించి పెట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
బ్లాకులకు వైఎస్, జక్కంపూడి పేర్లు పెట్టాలి
యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, జక్కంపూడి రామ్మోహనరావు పేర్లను యూనివర్సిటీలో రెండు బ్లాకులకు పెట్టాలని, ఉద్యోగాలలో స్థానికులకు కూడా అవకాశం ఇవ్వాలని విజయలక్ష్మి కోరారు. వాణిజ్య కార్యకలాపాలకు కూడా టెండర్లు పిలిచి పార్టీలకు అతీతంగా అనుమతులు ఇవ్వాలన్నారు.
ఇలా బయటపడింది...
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు సోమవారం యూనివర్సిటీకి రావడంతో 2009లో మాజీ సీఎం వైఎస్ భూమిపూజ చేసిన శిలాఫలకం విషయం వెలుగులోకి వచ్చింది. ప్రాంగణంలో ఎక్కడా ఆ శిలాఫలకం లేకపోవడాన్ని గమనించిన వైఎస్సార్‌సీసీ శ్రేణుల ద్వారా విషయాన్ని జక్కంçపూడి, రౌతు తదితరులు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం కార్పొరేటర్ బొంతా శ్రీహరి, తోకాడ సర్పంచి గండి నానిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు దేశాల శ్రీను, జక్కంపూడి జగపతి, తిక్కిరెడ్డి హరిబాబు, దూలం పెద్ద, కొల్లి వీర్రాజు, ఆకుల శ్రీను, ప్రగడ గోవిందు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి జక్కంపూడి అభీష్టం మేరకు..
రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు మూడు యూనివర్సిటీలను మంజూరు చేశారు. వాటిలో ఒకటైన నన్నయ యూనివర్సిటీని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారు. అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అభీష్టం మేరకు 2009 ఫిబ్రవరి 28న వైఎస్ భూమిపూజ చేశారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం జాతీయరహదారికి చేర్చి ఉండడంతో 2011లో యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ శిలాఫలకంతో పైలాన్ నిర్మించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్న యూనివర్సిటీని క్రమేణా ఈ ప్రాంగణంలోకి తరలించడంతో అభివృద్ధి పనులతో పాటు ఈ పైలాన్‌ను కూడా ఎవరూ పట్టించుకోలేదు.