క్యాంపుల బాబూ.. చాలిక నీ డాబు!

Jakkampudi Raja Fire On Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై వైఎస్సార్‌ సీపీ నేత జక్కంపూడి రాజా విమర్శ

పర్యటనలకు స్వస్తి చెప్పి, ప్రజాశ్రేయస్సు కోసం 

పాటు పడాలని హితవు    

సీతానగరం (రాజానగరం): క్యాంపుల బాబుగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇకనైనా పర్యటనలకు స్వస్తి చెప్పి, మిగిలిన కొద్ది రోజులైనా ప్రజాశ్రేయస్సు కోసం పాలన జరపాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా హితవు పలికారు. రఘుదేవపురం పంచాయతీ రాపాకలో పార్టీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యాన శనివారం జరిగిన ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమంలో పాల్గొన్న రాజా విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో ప్రజాధనంతో విదేశీ పర్యటనలు జరిపి, ఆయా దేశాల రాజధానుల్లా అమరావతిని మారుస్తానంటూ ప్రగల్భాలు పలికేవారని, ఇప్పుడు మన దేశంలోనే పర్యటిస్తూ దేశ రాజకీయాలను మార్చేస్తున్నాంటూ డప్పులు వాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

ఆయన కలిసిన పార్టీలన్నీ బీజేపీ వ్యతిరేక పక్షాలేనని, ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ఏం సాధించారో ఎవ్వరికీ అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఉంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయాందోళనలో చంద్రబాబు ఉన్నారని, అందుకే క్యాంపులు వేస్తూ ఏదో చేస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, భూ కుంభకోణాలు, మట్టి, ఇసుక మాఫియా, అగ్రిగోల్డ్‌ భూముల వివాదం వంటి పలు రూపాల్లో రాష్ట్రాన్ని దోచుకున్నారని రాజా ఆరోపించారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. 

జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే, వచ్చే ఎన్నికల్లో తన ఓటమి తప్పదని గ్రహించి, జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అందినకాడికి దోచుకుని, ఇప్పుడు తనను కాపాడుకోవడానికే దేశంలోని ఇతర పార్టీలను అడ్డు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశంలోనే అవినీతిలో నంబర్‌–1గా పేరొందిన చంద్రబాబు గురించి తెలియని పార్టీలు లేవని, ఆయన అవినీతి గురించి తెలియని నాయకులు లేరని ఆక్షేపించారు. ఇప్పటికైనా నక్కజిత్తులు కట్టిపెట్టి, ప్రజలను మోసం చేయడం మానుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వలవల రాజా, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకట్రాజు, ఎంపీటీసీ కోండ్రపు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top