అక్రమార్కులకు ‘షాక్‌’ ఇస్తారా? | Irregularities In APEPDCL | Sakshi
Sakshi News home page

అక్రమార్కులకు ‘షాక్‌’ ఇస్తారా?

Jun 30 2019 12:20 PM | Updated on Jun 30 2019 12:20 PM

Irregularities In APEPDCL - Sakshi

ఏపీఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం

సాక్షి, విజయనగరం: కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) అక్రమార్కులకు బంగారు బాతుగుడ్డుగా మారింది. అవినీతి,  అక్రమాలకు ఆలవాలంగా తయారైంది. సంస్థలో అక్రమ నియామకాలు, అడ్డగోలు ఇంక్రిమెంట్లు, తుపాన్లలో నిధుల దుర్వినియోగం వంటి ఎన్నో అడ్డదారి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎండీలుగా వ్యవహరించిన వారు, కీలకస్థానాల్లో ఉన్న మరికొందరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో ఈ అక్రమాలకు బాధ్యులపై చర్యలకు అడుగు ముందుకు పడడం లేదు. మూడు నెలల క్రితం ఈపీడీసీఎల్‌లో నిబంధనలకు విరుద్ధంగా 32 మందికి నోషనల్‌ ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తూ రూ.కోట్లు చెల్లించారు.

కానీ వీరికి ఇంక్రిమెంట్లు ఇవ్వడం ట్రాన్స్‌కో తేల్చి చెప్పినా ఇందుకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు.. ఈ 32 మంది నుంచి రికవరీ చేయాలని ట్రాన్స్‌కో ఆదేశించినా ఇప్పటిదాకా కొద్దిమంది నుంచే తప్ప మిగతా వారి నుంచి వసూలు చేయలేదు. అలాగే తిత్లీ తుపానులో ఈపీడీసీఎల్‌కు రూ.349 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులోనూ పెద్ద ఎత్తున నిధుల స్వాహా జరిగింది. పనులు చేయకుండానే చేసినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు చెల్లించడం, మెటీరియల్‌ కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు చూపి కోట్లాది రూపాయల నిధులను మింగినట్టు ఆరోపణలొచ్చాయి. అప్పటి విద్యుత్‌ శాఖ మంత్రి కళా వెంకట్రావు బంధువుల పేరిట ఉన్న సంస్థ నుంచి కండక్టర్ల కొనుగోలు చేసినట్టు చూపించి సొమ్ము స్వాహా చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంతటి భారీ కుంభకోణంపై కూడా ఎలాంటి చర్యలు లేవు.

గతంలో నిబంధనలకు విరుద్ధంగా జిల్లాల్లోని సర్కిల్స్‌ నుంచి సీనియర్‌ అసిస్టెంట్లను కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీలు చేయడం వెనక భారీగా చేతులు మారాయన్న విమర్శలు సంబంధిత అధికారులపై వచ్చాయి. అంతేకాదు.. స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టర్ల రెండేళ్ల టెండరు గడువు 2019తో ముగిసింది. కానీ వారు అడగకుండానే అప్పటి సీఎండీ హెచ్‌వై దొర 2020 వరకు కాంట్రాక్టు పొడిగించేశారు. అలాగే షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు కూడా లక్షల్లో అమ్ముడుపోయినా సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలూ లేవు. మరోవైపు 15 ఏళ్ల క్రితం నిబంధనలకు తిలోదకాలిచ్చి ఈపీడీసీఎల్‌లో వివిధ పోస్టుల్లో 29 మందిని నియమించారు. వీరిలో 28 మంది నకిలీలేనని దీనిపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్‌ అధికారులు తేల్చి నివేదికలిచ్చారు. చర్యలు తీసుకోవాలని రెండు మార్లు సిఫార్సు చేశారు. అయినా వీరు ఇప్పటికీ ఉద్యోగాల్లోనే కొనసాగుతూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.

ఇలా ఈపీడీసీఎల్‌లో చిన్నా చితకా కాదు.. భారీ అక్రమాలు, అవినీతి వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. 172 సబ్‌స్టేషన్ల ఏర్పాటులో ఎస్టిమేట్‌ రేట్లకంటే ఎక్కువకు మెటల్‌ కొనుగోలు చేయడంలోనూ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. పదేళ్ల నుంచి కొనుగోలు ఆర్డర్‌ ప్రకారం సకాలంలో సప్‌లై చేయనందుకు పోల్స్‌ తయారీ సంస్థలకు విధించిన పెనాల్టీనీ మాఫీ చేసి రూ.38 కోట్లు వెనక్కి చెల్లించడం పెను దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్‌ అధికారి నాగలక్ష్మి సెల్వరాజన్‌ వీటిన్నిటిపై దృష్టి సారిస్తారా? లేదా? ఈ సవాళ్లన్నిటీ ఆమె ఎలా ఎదుర్కొంటారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement