ఏపీ డేటా యమ ‘స్పీడ్‌’

Internet use in Andhra Pradesh increased due to lockdown - Sakshi

లాక్‌డౌన్‌తో 12 శాతం పెరిగిన నెట్‌ వినియోగం

సమీక్షలు, సమావేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే..  

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. మార్చి 22 నుంచి ఇప్పటివరకూ 12 శాతం డేటా వాడకం పెరిగినట్లు టెలికాం మంత్రిత్వ శాఖ చెబుతోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో డేటా వినియోగిస్తున్నారు. కానీ.. అక్కడ లాక్‌డౌన్‌ వేళ అదనంగా పెరిగిన వినియోగం 9 శాతం మాత్రమే. మార్చి 21కి ముందు రోజువారీ వినియోగం దేశ వ్యాప్తంగా 282 పెటాబైట్స్‌ (వెయ్యి టెరాబైట్స్‌) ఉంటే.. లాక్‌డౌన్‌ తర్వాత 308 పెటాబైట్స్‌కు పెరిగింది. మార్చి 22, 27 తేదీల్లో ఏకంగా 312 పెటాబైట్స్‌ వినియోగించారు. ఒక పెటాబైట్‌.. 500 బిలియన్‌ పేజీల ప్రింట్‌ టెక్టŠస్‌కు సమానం.

వినియోగం పెరగడానికి కారణాలివీ
► వివిధ సంస్థలు సర్వే నిర్వహించగా.. అన్ని పనులు ఆన్‌లైన్‌లో జరగడమే డేటా వినియోగం పెరగడానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తేలింది.
► జూమ్‌తో పాటు అనేక ఆన్‌లైన్‌ వీడియో యాప్‌ల వినియోగం బాగా పెరిగింది. దాదాపు 250 మందితో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడే వీలున్న ఇలాంటి యాప్‌లపైనే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఆధారపడుతున్నాయి. సమీక్షలు, సమావేశాలు అన్నీ ఇందులోనే జరుగుతున్నాయి. 
► కోవిడ్‌ సమాచారం చేరవేయడం, చర్యలు విస్తృతం చేయడానికి వెబ్‌ తరహా పర్యవేక్షణలు చేస్తున్నారు. 
► మరోవైపు ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉండనే ఉన్నాయి. ప్రధాన యూనివర్సిటీలన్నీ హై క్వాలిటీ డేటాతో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇది కూడా డేటా వినియోగాన్ని పెంచుతోంది. 
► డేటా వినియోగంలో వినోదం పాత్ర ప్రధానమైనదే అంటున్నారు నిపుణులు. పల్లె, పట్నం తేడా లేకుండా నెట్‌ అందుబాటులో ఉన్న ప్రతిచోట సినిమాలు, వినోద యాప్‌లకు జనం కనెక్ట్‌ అవుతున్నారు. 
► కుటుంబీకులంతా ఒకే చోట ఉండటం.. ఏదో ఒక వెరైటీ ఫుడ్‌ అందించాలన్న తపనతో మహిళలు ఆన్‌లైన్‌ వంటలకు కనెక్ట్‌ అవుతున్నారని తేలింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top