అర్హతలు లేకపోయినా దొడ్డిదారిన ప దోన్నతులు పొందేందుకు కొందరు పైరవీలు ప్రారంభించారు. వీరికి మద్దతుగా అధికారులపై రాజకీయంగా తీవ్రమైన ఒత్తిళ్లు తెస్తున్నారు.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: అర్హతలు లేకపోయినా దొడ్డిదారిన ప దోన్నతులు పొందేందుకు కొందరు పైరవీలు ప్రారంభించారు. వీరికి మద్దతుగా అధికారులపై రాజకీయంగా తీవ్రమైన ఒత్తిళ్లు తెస్తున్నారు. పదోన్నతులు ఇచ్చిన తర్వాత మాతృశాఖలో పోస్టులు ఖాళీలు లేకపోతే మరోశాఖ కు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు అవసరమైన మార్గాలు అప్పుడే చూసుకున్నామంటూ అధికారులను నమ్మిస్తున్నారు.
అయితే పదోన్నతులు కల్పించే విషయంలో రాజకీయపరమై న ఒత్తిళ్లు వస్తున్నా అధికారులు ఆచితూచి అ డుగులు వేస్తున్నారు. జిల్లా పరిషత్‌లో ప్రస్తు తం ఏడు సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆయా పోస్టులకు అదనంగా మరో నలుగురికి అవకాశం కల్పిస్తూ 11మందికి సూపరింటెండెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వాలని ఒత్తిళ్లు వస్తున్నాయి. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ప్రస్తుతం ఆరుఖాళీలు ఉండగా, జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్న వారిలో మొత్తం 25 మందికి పదోన్నతులు ఇవ్వాలంటూ రాజకీయంగా పైరవీలు అధికమయ్యాయి.
11 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీఉండగా వాటిని కాదని మరింత ఎక్కువమంది కిందస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని ఒత్తిళ్లు రావడంతో ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చించకుండా చకచకా ఫైల్ ను సిద్ధం చేసి జెడ్పీ సీఈఓ వద్దకు పంపారు. పరిశీలించిన సీఈఓ ఖాళీల మేరకే పదోన్నతులు కల్పిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందికి పదోన్నతులు ఇవ్వలేమని.. ఆ ఫైల్‌ను తిరిగి వెనక్కి పంపినట్లు సమాచారం. అయితే ఎక్కువ మందికి పదోన్నతులు కల్పిస్తే జిల్లా పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల మేరకు నియమించినా మిగిలిన వారంతా మరో శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లే అవకాశం ఉందని పైరవీకారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా అధికారులు వారి ఆటలు సాగనీయకుండా ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఇలా..
గతంలో ఇష్టమొచ్చినట్లు మరోశాఖకు డిప్యుటేషన్‌పై పంపి ఆ పోస్టులను ఖాళీలుగా చూపి వాటి స్థానంలో పదోన్నతులు కల్పించిన సందర్భాలూ ఉన్నాయి. జెడ్పీలో ఉద్యోగం చేస్తూ డీఆర్‌డీఏ, ఐకేపీ, డ్వామా, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ శాఖలకు, ప్రజాప్రతినిధులకు పీఏలుగా వెళ్లి చాలా మంది పనిచేస్తున్నారు. డిప్యుటేషన్‌పై వెళ్లిన వారి పోస్టులను భర్తీ చేసేందుకు కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తుండటంతో ప్రస్తుతం జిల్లా పరిషత్‌కు ప్రభుత్వం మంజూరుచేసిన పోస్టుల కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లయింది. ఇదిలాఉండగా ప్రస్తుతం కొంతమంది మరో శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్తామని, అందుకు పదోన్నతులు కల్పించాలని ఒత్తిళ్లు తెస్తున్నా నిబంధనల మేరకు పదోన్నతి పొందిన వ్యక్తి అదేశాఖలో రెండేళ్లు పనిచేసిన తర్వాతే మరోశాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు మున్ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పదోన్నతుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. ఈ విషయమై జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈఓ రవీందర్‌తో ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.