నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ పలుచోట్ల విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర పన్నుతోందని ఐబీ హెచ్చరికలు చేసింది. దాంతో జంట నగరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
కాగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో జంటనగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బార్లు, పబ్బులల్లో రాత్రి 12 వరకు, హోటల్స్, రిసార్ట్స్‌లలో రాత్రి 1 గంట వరకు కొత్త సంవత్సర వేడుకలకు అనుమతించారు. రాత్రి 2 గంటల వరకు హైదరాబాద్ నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తున్నారు. ఇటు సైబరాబాద్‌లోని పివి ఎక్స్‌ప్రెస్‌వేపై ఎయిర్ టికెట్ ఉన్న వారికి వినహా మిగతా వారికి అనుమతి నిషేధించారు. ఔటర్ రింగ్‌రోడ్‌పై రాకపోకలను నియంత్రిస్తున్నారు.
నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లలోరాకపోకలు నిషేధించి ఆ మార్గంలో వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎక్కడిక్కడే డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్ని శ్రుతిమించకుండా నిర్వహించుకోవాలని జంటనగరాల ప్రజలకు హైదరాబాద్ సిటి కమిషనర్ అనురాగ్ శర్మ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇప్పటికే కోరారు.