మరుగుదొడ్ల అక్రమాలపై విచారణ

Inquiry On Toilets Corruptions - Sakshi

రాత్రి మంతనాలతో విచారణాధికారిని మార్చిన టీడీపీ నాయకుడు

విచారణ సమయంలో వైఎస్సార్‌ సీపీ నాయకులతో వాగ్వాదం

బొబ్బిలి రూరల్‌: మండలంలోని పారాది గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలలో జరిగిన అక్రమాలపై ఈఓపీఆర్‌డీ సీహెచ్‌ఎస్‌ఎన్‌ఎం రాజు, మండల జేఈ బర్ల భాస్కరరావు మంగళవారం విచారణ చేపట్టారు. గ్రామంలో కొందరిని విచారణ చేసే సమయంలో అక్రమాల అనకొండ, టీడీపీ నాయకుడు అక్కడే ఉండి అందరినీ భయబ్రాంతులకు గురిచేసే యత్నం చేశాడు. దీంతో కొందరు బయటకు రాలేకపోయారు. మరోవైపు వైఎస్సార్‌ సీపీ నాయకులు అల్లాడ నగేష్‌ వివరాలు చెబుతుండగా ముప్పేట దాడికి యత్నించారు. దీంతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకొంది. అక్రమాల చిట్టా వివరించిన నగేష్‌ సాంకేతికంగా కొన్ని వివరాలు విచారణాధికారులు నమోదు చేసుకోవాలని, అక్రమాలకు పాల్పడ్డవారు అక్కడే ఉంటే విచారణ ఎలా చేస్తారని, మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించే యత్నాలు టీడీపీ నాయకులు మానుకోవాలని సూచించారు. విచారణాధికారులు మరుగుదొడ్లు నిర్మాణాలను పరిశీలించారు. విచారణ కొనసాగిస్తామని తెలిపారు.

విచారణాధికారిని మార్చిన నాయకులు...
పారాది అక్రమాలపై ఆర్డీఓ సుదర్శనదొర ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ శంకరరావును నియమించగా, టీడీపీ నాయకులు డమ్మీ ఎంపీపీ కలిపి మండల జేఈ బర్ల భాస్కరరావును నియమించారు. శంకరరావు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడతారని, తిరిగి తమకు నష్టం కలుగుతుందనే భావంతో రాత్రికి రాత్రి విచారణాధికారి పేర్లు మార్చి తక్షణమే విచారణ చేయించేలా చర్యలు చేపట్టారు. ఏదోలా తూతూమంత్రంగా విచారణ చేయిస్తే ఊరుకోబోమని, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ శంకరరావును విచారణాధికారిగా ఆర్డీఓ నియమిస్తే ఆయనను ఎందుకు తప్పించారని పలువురు ప్రశ్నిస్తూ ఈ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాము లోకాయుక్తకు వెళ్తామని, న్యాయవాది, వైఎస్సార్‌ సీపీ నాయకులు అల్లాడ నగేష్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top