వైద్యరంగం మహోన్నతమైంది.. | 'India's healthcare sector to grow | Sakshi
Sakshi News home page

వైద్యరంగం మహోన్నతమైంది..

Jan 11 2014 2:34 AM | Updated on Oct 9 2018 7:52 PM

వైద్యరంగం మహోన్నతమైంది.. - Sakshi

వైద్యరంగం మహోన్నతమైంది..

అన్ని రంగాల కంటే వైద్య రంగం ఎంతో మహోన్నతమైందని, కృషి పట్టుదల ఉంటేనే ఈ రంగంలో రాణించగలుగుతారని ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఐవీ రావు అన్నారు.

 ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:  అన్ని రంగాల కంటే వైద్య రంగం ఎంతో మహోన్నతమైందని, కృషి పట్టుదల ఉంటేనే ఈ రంగంలో రాణించగలుగుతారని ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఐవీ రావు అన్నారు. శుక్రవారం నగరంలోని మమత మెడికల్ కళాశాల ఆడిటోరియంలో మెడికోల గ్రాడ్యుయేట్ పట్టాల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  వైద్య వృత్తి ఉన్నతమైన విలువలు కలిగిందని, ప్రస్తుత సమాజానికి వైద్య సేవలు ఎంతో అవసరమని అన్నారు. వైద్య రంగ ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకు డిగ్రీలు పొందిన విద్యార్థులు కృషి చేయాలని, రోగిని కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు. డాక్టర్ కోర్సు పూర్తి చేశాం.. ఇక అంతా అయిపోయింది అనుకోవడం పొరపాటని, వైద్య రంగంలో ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటుందని అన్నారు.
 
 యువ డాక్టర్లు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అన్నారు. వైద్యలు వ్యవహరించే తీరుతోనే రోగికి సంగం ఆరోగ్యం కలుగుతుందని, మాటలతో రోగికి సాంత్వన కలిగించాలని చెప్పారు. భవిష్యత్‌లో వైద్య రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయని, వాటిని సులువుగా తెలుసుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఆరేళ్ల కష్టానికి అందుకుంటున్న పట్టాలతో సమాజంలోకి వెళ్లిన తర్వాత చదువుకున్న కళాశాలకు, తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈరోజు విద్యార్థుల జీవితంలో ఎంతో అమూల్యమైన రోజుగా ఆయన అభివర్ణించారు. మమత విద్యాసంస్థల చైర్మన్ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎంతో విలువైన, అమూల్యమైన వైద్యులను అందించే అదృష్టం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
 
 గ్రాడ్యుయేట్స్‌డే, స్పోర్ట్స్‌డే కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్స్, పీజీల గౌరవ వందనాన్ని వైస్ చాన్స్‌లర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మమత విద్యాసంస్థల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు, డెరైక్టర్ జయశ్రీ, మెడికల్, డెంటల్, నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రత్నకుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఖాజా, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ భాగం కిషన్‌రావు, అసోసియేట్ ప్రొఫెసర్ బండారుపల్లి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement