భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పదని, భారతీయులుగా పుట్టినందుకు మనమెంతో గ ర్వించాలని జగద్గురు పీఠం భౌగోళిక అధ్యక్షుడు మాస్టర్ కంభంపాటి పార్వతీ కుమార్ అభిభాషించారు.
- ప్రాక్-పశ్చిమ సమన్వయం ఒక యజ్ఞం
- జగద్గురు పీఠం అధ్యక్షుడు పార్వతీ కుమార్
సింహాచలం, న్యూస్‌లైన్: భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పదని, భారతీయులుగా పుట్టినందుకు మనమెంతో గ ర్వించాలని జగద్గురు పీఠం భౌగోళిక అధ్యక్షుడు మాస్టర్ కంభంపాటి పార్వతీ కుమార్ అభిభాషించారు. జగ ద్గురు పీఠం ఆధ్వర్యంలో సింహాచలంలో జరుగుతున్న 53వ గురుపూజా మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ప్రాక్-పశ్చిమ సమన్వయ కార్యక్రమం విశేషంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్వతీకుమార్ సాధకులనుద్దేశించి మాట్లాడారు. పరమ గురువుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రాక్-పశ్చిమ ఆధ్యాత్మిక సమ్మేళనం ఒక యజ్ఞమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 1875లో దివ్యజ్ఞాన వ్యవస్థాపకురాలు, రష్యా దేశస్తురాలు మేడం బ్లావెట్క్సీ ఈ యజ్ఞాన్ని ప్రారంభించారని, తర్వాత ఏలిస్ ఏ బైలీ, నికోలిక్, మాస్టర్ ఇ.కె. వంటి మహాత్ములు ఈ యజ్ఞాన్ని కొనసాగించారన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న స్విట్జర్లాండ్ దేశీయుడు లుగ్దర్ ప్రసంగిస్తూ జగద్గురు పీఠం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు భౌగోళికంగా వ్యాప్తి చెందుతున్నాయని, మాస్టర్ పార్వతీ కుమార్ చేసే ప్రసంగాలు, రచనలు విదేశీయులకు ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయన్నారు. జెనీవాకు చెందిన రైనా, స్పెయున్ దేశీయుడు మైకేల్, అర్జంటీనా దేశస్తురాలు పెట్రోషియా తమ భావాలను సభలో వివరించారు. ఈ సందర్భంగా మాస్టర్ ఎం.ఎన్. ప్రాణామాయ గ్రంథాలు, జర్మనీ, స్పానిష్ గ్రంథాలను విడుదల చేశారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హిందూ ధర్మం ప్రచారానికి కృషి చేస్తున్న సంస్థలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సింహాచల దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ అన్నారు. సాధకులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భం పార్వతీకుమార్ ఈవోను దుశ్శాలువతో సత్కరించారు. సామూహిక లలితా సహస్రనామార్చన విశేషంగా జరిగింది. దేశ విదేశీ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు ఉపనయనాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.