‘ఖనిజం’లో కంత్రీలు 

Illegal Mining In Vizianagaram District - Sakshi

పెరిగిపోతున్న అనధికార తవ్వకాలు 

అక్రమ మార్గాల్లో తరలిపోతున్న సంపద 

ప్రభుత్వ ఆదాయానికి పడుతున్న గండి 

జిల్లాలో 2027 హెక్టార్లలో విస్తరించిన క్వారీలు 302 

పనిచేస్తున్నవి కేవలం 108 

2019–20లో భారీగా పడిపోయిన తవ్వకాలు 

గడచిన ఆరునెలలు గా నెమ్మదిగా సాగుతున్న ఉత్పత్తి 

సాక్షి ప్రతినిధి, విజయనగరం:  జిల్లాలో ఖనిజ సంపదకు లోటు లేదు. అపారమైన ఖనిజ సంపద మన జిల్లా సొంతం. కానీ ప్రభుత్వానికి ఆదాయం మాత్రం అంతంతే. జిల్లా వ్యాప్తంగా గరివిడి, దత్తిరాజేరు, బొబ్బిలి, రామభద్రపురం, కొత్తవలస, చీపురుపల్లి, మెరకముడిదాంతో పాటు పలు ప్రాంతాల్లో ఖనిజ సంపద ఉన్నా ప్రభుత్వానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఆదాయం రావట్లేదు. మార్కెట్లో ఎంతో విలువున్న ఈ ఖనిజ సంపద తరలించేందుకు గత ప్రభుత్వాలు అమలు చేసిన గంపగుత్త విధానం ఒక కారణమైతే... అనధికార తవ్వకాలు.. అక్రమంగా తరలింపు రెండో కారణం. గనుల శాఖ లెక్కలను బట్టి  జిల్లాలో గతేడాది కన్నా ఈ ఏడాది మరీ ఘోరంగా ఉత్పత్తులు తగ్గిపోయాయి. దీని వల్ల రవాణా కూడా తగ్గింది. ఇప్పుడు కరోనా కారణంగా అదికాస్తా మరింత దిగజారింది.  

అనుమతులు తక్కువ.. తవ్వకాలు ఎక్కువ... 
జిల్లాలో ఏడాదిన్నరగా ఖనిజ సంపద ఉన్నా తవ్వకాలు, రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. లేబర్‌ కొరతతో పాటు అనుమతులున్న కంపెనీలను మించిన అనధికార కంపెనీల నిర్వహణ ఒక కారణంగా ఉంది. జిల్లాలో ఉన్న క్వారీల్లో ఒకరి పేరున క్వారీ అనుమతులుంటే మరొకరు నిర్వహించడం సాధారణమయిపోయింది. దీనిని గతంలో అధికారులు గుర్తించినా... వారికి నామమాత్రపు జరిమానాలు వేసి ఆ తరువాత వారికే పేర్లు మార్చుకునే అవకాశాలు ఇచ్చారని తాజాగా బొబ్బిలి ప్రాంతంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

తగ్గిన క్వార్ట్‌జ్, కలర్‌ గ్రానైట్ల తవ్వకాలు  
జిల్లాలో ఆరు రకాల క్వారీలుండగా అందులో కలర్‌ గ్రానైట్,  క్వార్ట్‌జ్‌ల తవ్వకాలు తగ్గిపోయాయి. మరో పక్క మాంగనీస్, తదితర క్వారీల తవ్వకాల్లోనూ వృద్ధి కానరావడం లేదు. 2018–19 సంవత్సరంతో పోలి్చతే 19–20 సంవత్సరంలో భారీగా తవ్వకాలు పడిపోయాయి. ఈ ఏడాది నుంచి చూసుకుంటే గత ఆరు నెలలుగా తవ్వకాలు, ఉత్పత్తి నెమ్మదిగానే కనిపిస్తోంది.  

గంపగుత్త కాంట్రాక్టులతోనే అనధికారిక క్వారీలు  
గత ప్రభుత్వం ఎటువంటి అంచనాలు, రిపోర్టులు లేకుండా గంపగుత్తగా లైసెన్సులు జారీ చేసిందనీ, అందుకు కాంట్రాక్టర్లు(లైసెన్సుదారులు) తమకు ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకాలు జరుపుకుని లబి్ధపొందారన్న ఆరోపణలు గతంలోనే వినిపించాయి. దీనికి తోడు ఒక క్వారీ దగ్గర తవ్వి మరో క్వారీ పేరున(లీజు కాలం అయిపోయినందున)రవాణా చేసుకుంటున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలా మైనింగ్‌ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి జరిమానాలు తూతూమంత్రంగా వేసినట్టు ఇప్పటికీ పలువురు చెబుతుంటారు. 

కొత్తగా వేలం విధానం 
ప్రభుత్వం కొత్తగా క్వారీలను వేలం విధానంలో ఇచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. జీఎస్‌ఐ(జియాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) ఆధ్వర్యంలో కొన్ని చోట్ల సర్వే చేసి ఏ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజం ఉన్నదో దానిని విలువ కట్టి, తవ్వకాలు, నిర్వహణలను బేరీజు వేసుకుని ధర నిర్ణయిస్తారు. దీనికి సంబంధించిన శాఖా పరమైన సిబ్బంది తక్కువ ఉండటంతో అన్ని చోట్లా ఈ విధానం అమలుకు వీలు పడదు. కాబటివ్ట కొన్ని చోట్ల థర్డ్‌ పార్టీ ద్వారా సర్వే చేయించి వేలం పద్ధతిలో కేటాయించే ఆలోచన చేస్తోంది.

కొత్తవిధానానికి కసరత్తు చేస్తున్నాం  
జిల్లాలో కొత్త ఖనిజ తవ్వకాలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమలు పరిచేందుకు కసరత్తు చేస్తున్నాం. ఉన్న ఖనిజ సంపదను సక్రమ మార్గంలో రవాణా చేసి ప్రభుత్వాదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.   
 – పూర్ణ చంద్రరావు, డిప్యూటీ డైరెక్టర్, మైన్స్‌ అండ్‌ మినరల్స్, విశాఖపట్నం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top