ఇదిగో..నరకం.. | Idigonarakam .. | Sakshi
Sakshi News home page

ఇదిగో..నరకం..

Oct 12 2014 12:26 AM | Updated on Sep 2 2017 2:41 PM

ఇదిగో..నరకం..

ఇదిగో..నరకం..

కర్నూలు (హాస్పిటల్): ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఉంది కర్నూలులోని సర్వజన ప్రభుత్వాసుపత్రి తీరు.

కర్నూలు ప్రభుత్వాస్పత్రి అత్యవసర విభాగంలో దుస్థితి

 కర్నూలు (హాస్పిటల్): ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఉంది కర్నూలులోని సర్వజన ప్రభుత్వాసుపత్రి తీరు. ఇక్కడ రోగులకు అవసరమయ్యే అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించుకోలేని దుస్థితిలో యంత్రాంగం ఉంది. ఆస్పత్రిలోని క్యాజువాలిటీ(అత్యవసర విభాగం)లో స్ట్రెచర్లు, వీల్‌చైర్లు ఉన్నాయి. కానీ అవి రోగులకు ఏమాత్రం ఉపయోగపడడంలేదు. వాటిని ఓ గదిలో పెట్టి భద్రంగా తాళాలు వేశారు. దీంతో స్ట్రెచర్లు, వీల్‌చైర్లు లేక రోగులు, రోగుల సహాయకులు, ప్రమాద బాధితులు ఇబ్బందిపడుతున్నారు.

సంబంధిత అధికారులు ప్రతి రోజూ క్యాజువాలిటీ మీదుగా రాకపోకలు సాగిస్తున్నా.. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. క్యాజువాలిటీకి నిత్యం రోడ్డు ప్రమాద బాధితులు కర్నూలుతో పాటు ఇతర జిల్లాల నుంచి వస్తుంటారు. అప్పటికే కాళ్లు, చేతులు విరిగి తలకు గాయాలై నరకయాతన అనుభవిస్తు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే బాధితులకు కనీస సదుపాయాలు అందడంలేదు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన రోగులు, ప్రమాద బాధితులు అక్కడి నుండి క్యాజువాలిటీకి వెళ్లాలంటే 20 నుంచి 30 అడుగుల దూరం ఉంటుంది.

నడవలేని స్థితిలో వచ్చిన బాధితులకు, ఇక్కడ నుండే నరకం ప్రారంభం అవుతుంది. క్యాజువాలిటీకి తరలించాలంటే స్ట్రెచర్లు, వీల్‌చైర్లు తప్పనిసరి. అయితే అవి అందుబాటులో ఉండడంలేదు. దాతలు ఉచితంగా ఇచ్చిన స్ట్రెచర్లు(కొత్తవి) వీల్‌చైర్లు క్యాజువాలిటీ విభాగం ఎదురుగా ఉన్న ఓ గదిలో మూలన పడేశారు. ఉన్న ఒకటి, రెండు స్ట్రెచర్లు కనబడితే ఉన్నట్లు.. లేకుంటే లేనట్లే. వీటిని తరలించే వార్డు బాయ్‌లు రమ్మన్నా రారు. బాధితుని బంధువులు ఓ స్థాయిలో ఉంటే స్ట్రెచర్ బయటికి వస్తుంది.

లేకుంటే ప్రాధేయపడినా రాదు. అడిగేవారు లేరు. వార్డు బాయ్‌లకు నిక్కచ్చిగా చెప్పేవారు లేరు. దీంతో నిత్యం ప్రమాద బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల సీఎస్‌ఆర్‌ఎంఓ ప్రత్యేకంగా దృష్టి సారించి స్ట్రెచర్లు, వీల్‌చైర్లు ప్రధాన ద్వారం వద్ద పెట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఆ అధికారి ఉన్నంత సేపు స్ట్రెచర్ కనబడుతుంది. ఆ తర్వాత మళ్లీ యథాతథం. ఇక ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉండే రోగి వివిధ రకాల పరీక్షల నిమిత్తం మరో చోటుకి తరలించాలంటే స్ట్రెచర్లు అవసరం.

అలాగే రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిన వ్యక్తులకు ప్రాథమిక చిక్తిత్స అనంతరం ఆర్థోపెడిక్ వార్డుకు తరలించాలి. స్ట్రెచరు లేనిదే బాధితున్ని తరలించడం ఎంతో ఇబ్బంది. అయినా ఇబ్బందులు తప్పడం లేదు. రోగుల సహాయకులే భుజాన వేసుకుని తరలిస్తున్న సంఘటనలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వసాధారణం. ప్రజారోగ్యానికి రూ.కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ప్రమాద బాధితులకు, రోగులకు కనీస అవసరాలైన స్ట్రెచర్లు, వీల్‌చైర్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆసుపత్రి అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాలి. ఇప్పటికైనా అధికారులు ఆసుపత్రిలో ఎన్ని స్ట్రెచర్లు ఉన్నాయి? ఎన్ని వీల్‌చైర్లు ఉన్నాయి? రిపేరీలో ఉన్నవి ఎన్ని? అన్న వాటిపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. క్యాజువాలిటీ ఎదురుగా ఉన్న గదిలో కొత్త వీల్‌చైర్లు, స్ట్రెచర్లను ఎందుకు మూలన పడేశారో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement