హోదాపై స్పందించిన ఐపీఎస్ లక్ష్మీనారాయణ

I Do Not Want To Join In Any Party, Says IPS Lakshmi Narayana - Sakshi

పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ

సాక్షి, గుంటూరు: సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్, మహారాష్ట్ర మాజీ అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇందు కోసం తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేశారా? అన్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. అయితే అప్పటిలోగా తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నాక, తన ప్రణాళికను వెల్లడిస్తానన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే సంజీవనిగా భావించే ప్రత్యేక హోదా రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు. హోదా వస్తేనే కంపెనీలు ఇక్కడికి తరలివచ్చి రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

కర్లపాలెం మండలం యాజిలీలో అభయ ఫౌండేషన్ చైర్మన్ బాలచందర్, ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ ఇక్కుర్తి లక్ష్మి నరసింహాలు సంయుక్తంగా ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. లాభసాటి వ్యవసాయంపై రైతులతో ముఖాముఖీలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం ఓ మంచి కార్యక్రమం యాజిలీలో ప్రారంభించడం అదృష్టం. రైతుల కోసం ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ ప్రయత్నం అభినందనీయం. యాజిలీ లాంటి జెడ్పీ హైస్కూల్‌ను నేనెక్కడా చూడలేదు. తనకు సున్నా మార్కులు వస్తున్నా.. ప్రజలకు వంద మార్కులు తెచ్చేందుకు రైతన్న ప్రయత్నం చేస్తాడు.  

ఎన్‌ఆర్డీఎస్ సంస్థలో పని చేస్తానని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదు. వాళ్లను వేడుకోవడం కంటే ఉద్యోగం మానేస్తే నాకు నచ్చిన చోట పనిచేయవచ్చునని వీఆర్‌ఎస్ తీసుకున్నా. నేను రేపు వ్యవసాయశాఖ మంత్రి అయితే రైతులకు ఏం చేయాలో ఆలోచిస్తాను. మంత్రిని కాకపోతే సామాజిక కార్యకర్తగా పనిచేస్తా. రైతులకు 200 మార్కులు వచ్చేలా మేం కృషి చేస్తాం. ముందు మేం ఉంటాం. మా వెంట మీరు నడవండంటూ లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top