జీహెచ్‌ఎంసీ, జలమండలి వంటి స్థానిక సంస్థల విభాగాల్లో రోజువారీ పరిపాలనా వ్యవహారాలపై విభజన ఎలాంటి ప్రభావం చూపదన్నది నిపుణుల మాట.
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ, జలమండలి వంటి స్థానిక సంస్థల విభాగాల్లో రోజువారీ పరిపాలనా వ్యవహారాలపై విభజన ఎలాంటి ప్రభావం చూపదన్నది నిపుణుల మాట. ఇక నగరంలో కొలువైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయం, ఆయా విభాగాల డెరైక్టరేట్లు, క మిషనరేట్లు సహా సుమారు 105 సర్కారు కార్యాలయాల్లో విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకే ప్రాంగణంలో ఉన్న కార్యాలయాలను వీలును బట్టి బ్లాకుల వారీగా రెండుగా విభజించి ఉభయరాష్ట్రాల్లో పాలన సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. అలా వీలుకాని పక్షంలో నగరంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో సీమాంధ్ర రాష్ట్ర కార్యాలయాలను పదేళ్లపాటు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాగా విభ జన అంశం తెరమీదకు వచ్చినప్పటి నుంచి గ్రేటర్ నగరం భవిష్యత్‌పై అనేక ఊహాగానాలు వ్యక్తమయిన విషయం విదితమే.
నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారా.. లేక గవర్నర్ పాలకమండలి చేతిలో పెడతారా.. చండీగఢ్ తరహా పాలన అమలు చేస్తారా.. అన్న అంశంపై చర్చోపచర్చలు సాగాయి. ఒక దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలతో ప్రత్యేక శాసనసభ ను ఏర్పాటు చేస్తారన్న పుకార్లూ షికారు చేశాయి. అనేక తర్జనభర్జనల అనంతరం కేంద్రం ఈ సస్పెన్స్‌కు మంగళవారం లోక్‌సభలో తెర దించింది. మొదట్లో అనుకున్నట్లుగానే గ్రేటర్ పరిధిని ఉమ్మడిగా ప్రకటించింది.
ఉమ్మడి రాజధానిగా గ్రేటర్‌ను ప్రకటించిన నేపథ్యంలో మహానగర విశేషాలపై ప్రత్యేక కథనం..
మెట్రోల్లో ఆరు.. జనాభాలో నాలుగు..
దేశంలోనే అతిపెద్ద మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది.
అతిపెద్ద మెట్రో ముంబై కాగా.. తర్వాతి స్ధానాల్లో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలు నిలిచాయి.
జనాభాలో మాత్రం నాలుగో స్థానం ఉంది.
అత్యధిక జనాభా ఉన్న నగరంగా ముంబై నిలవగా.. తర్వాతి స్ధానాల్లో ఢిల్లీ, బెంగళూరు ఉన్నాయి.
78,00,000 జనాభాతో హైదరాబాద్ నాలుగో స్థానం దక్కించుకుంది.
అత్యధిక జన సాంద్రత గల నగరాల సరసన చేరింది.
గడువులోగానే మెట్రో ప్రాజెక్టు
నగరంలోని ఎలివేటెడ్ మెట్రో ప్రాజెక్టుపై రాష్ట్ర విభజన అంశం ఎలాంటి ప్రభావం చూపదని ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
గడువులోగానే మెట్రో పనులను పూర్తిచేస్తామని తెలిపాయి.
వచ్చే ఏడాది మార్చి 22న నాగోల్-మెట్టుగూడ రూట్లో మొదటి దశ పనులు పూర్తవుతాయన్నారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ సిటీలో మెట్రో ప్రాజెక్టు నగర పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.