ధర్మపోరాటం.. చాలా ఖరీదు గురూ

Huge meetings with peoples money  - Sakshi

కేంద్రంపై పోరాటం ముసుగులో చంద్రబాబు సొంత ప్రచారం

ప్రజల సొమ్ముతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ సభలు

ఒక్కో సభకు రూ.4 కోట్ల ఖర్చు

సాక్షి, అమరావతి: రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది అంటూ నిత్యం బీద అరుపులు అరుస్తూ, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్న సీఎం చంద్రబాబు మరోవైపు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. కేంద్రంపై ధర్మపోరాటం పేరిట రూ.కోట్ల వ్యయంతో జిల్లాల్లో భారీఎత్తున సభలు నిర్వహిస్తున్నారు.  ఈ సభల వల్ల ఖజానాకు నష్టమే తప్ప ప్రజలకు పైసా కూడా ఉపయోగం లేదని  ప్రభుత్వ ఉన్నతాధికారులే పెదవి విరుస్తున్నారు.

కలెక్టర్లదే బాధ్యత: బాబుగారి ధర్మపోరాటం చాలా ఖరీదు గురూ అంటూ సచివాలయంలో పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. సభలకు చేస్తున్న వ్యయాన్ని చూసి ఉన్నతాధికారులు నివ్వెరపోతున్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్మపోరాట సభకు ఏకంగా రూ.4 కోట్లు ఖర్చవుతోందని, ప్రజాధనంతో ముఖ్యమంత్రి వ్యక్తిగత, రాజకీయ ప్రచారం చేసుకోవడం ఎక్కడా చూడలేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ధర్మపోరాట సభల నిర్వహణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్లు చేస్తున్నారు. సభ వేదిక, సభలో కుర్చీలు, జనాన్ని బస్సుల్లో తీసుకురావడం, వారికి భోజనాలు, వీఐపీలకు బస, తదితర బాధ్యతలను కలెక్టర్లు చేపడుతున్నారు. వీటి కోసం నిధులివ్వాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖకు లేఖలు రాస్తున్నారు.

బూడిదలో పోసిన పన్నీరే..: విజయవాడలో నిర్వహించిన ధర్మపోరాట సభకు రూ.4 కోట్లు ఖర్చు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ వినతి మేరకు ప్రణాళికా శాఖ తొలుత రూ.2 కోట్లు ఇచ్చింది. మరో రూ.2 కోట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాశారు.

ధర్మపోరాట సభలకు తాము నిధులు ఇవ్వలేమని సాధారణ పరిపాలన శాఖ తేల్చిచెప్పింది. కలెక్టర్‌ రాసిన లేఖను ప్రణాళికా శాఖకు పంపించింది. తమ దగ్గర నిధుల్లేవని, జిల్లా నిధుల నుంచే బిల్లులు చెల్లించుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ప్రణాళికా శాఖ సూచించింది. ధర్మపోరాట సభలతో ముఖ్యమంత్రికి తప్ప ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని అధికారులు అంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top