కలెక్టర్‌ భాస్కర్‌కు జైలుశిక్ష, జరిమానా | High Court Punish to District Collector Katamaneni Bhaskar | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ భాస్కర్‌కు జైలుశిక్ష, జరిమానా

Dec 1 2018 7:46 AM | Updated on Dec 1 2018 7:46 AM

High Court Punish to District Collector Katamaneni Bhaskar - Sakshi

జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎస్సీ కార్పొరేషన్‌లో ఉద్యోగులకు సంబంధించిన వివాదంలో హైకోర్టు తీర్పును అమలు చేయని కారణంగా జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌కు హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్షను విధించడం సంచలనంగా మారింది. ఏడాది కాలంగా ఎస్సీ కార్పొరేషన్‌లో ఆరుగురు ఉద్యోగుల జీతాల విషయంలో వివాదం నెలకొనడం, గత ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఆరుగురు ఉద్యోగులపై త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత ఉద్యోగులు న్యాయపోరాటం చేశారు. ఈ వ్యవహారంపై తామిచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని నిర్ధారిస్తూ కోర్టు ధిక్కారం కింద జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరువారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ఎం.ఎస్‌.రామచంద్రరావు  ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా ఎస్సీ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఎస్‌.వి.శేషగిరిరావు మరో ఐదుగురు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి జూనియర్‌ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్‌ వచ్చింది. ఆ మేరకు వారు వేతనాలు అందుకుంటున్నారు. అయితే వీరిని నిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్‌ చేశారని, అక్రమంగా పదోన్నతులు ఇచ్చారని నిర్ధారిస్తూ వారి వేతనాలు నిలిపివేశారు. దీనిపై తమ జీతాల విడుదలకు 2015లో హైకో ర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లకు జీతాలను విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే ఈ ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంతో శేషగిరిరావు తదితరులు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటీషన్‌ వేశారు. అయితే ఆ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు సుప్రీంకోర్టు తమ ఆదేశాలపై స్టే ఇవ్వనందున, తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని భావిస్తూ జిల్లా ఎస్సీ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ హోదాలో ఉన్న కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌కు నెల రోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. అప్పీల్‌ నిమిత్తం తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేశారు. జిల్లా కలెక్టర్‌కు కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement