‘పుంజు’కున్నాయి..

Hen Fights In East Godavari - Sakshi

రంగంపేట మండలంలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో కోడి పందేలు

రెండు గోదావరి జిల్లాల నుంచి హాజరైన పందెగాళ్లు

పోలీస్‌ స్టేషన్‌కు అర కిలో మీటరు దూరంలో ఆయిల్‌పామ్‌ తోటలో నిర్వహణ

ఆరుగురు అరెస్టు, రూ.13,120  నగదు, రెండు కోళ్లు, తొమ్మిది కత్తులు స్వాధీనం

తూర్పుగోదావరి, రంగంపేట (అనపర్తి):  పండగ హడావుడి మొదలైంది. పందెపు కోళ్లు బరిలోకి దిగాయి. రంగంపేట మండలంలో కోళ్లు.. కోట్లు కొల్లగొట్టే పనిలో పడ్డాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఫైటింగ్‌కు సిద్ధమయ్యాయి. కోడిపందేలు, జూదాలపై ఉక్కుపాదం మోపుతామంటూ ఓ పక్క పోలీసులు ప్రకటిస్తుండగా.. ఆ హెచ్చరికలను సైతం పక్కన పెట్టి పందెగాళ్లు పందేలు జోరుగా నిర్వహిస్తున్నారు. అదీ కూడా పోలీస్‌ స్టేషన్‌కు కేవలం అరకిలోమీటరు దూరంలో జరగడం విశేషం.

కాలు దువ్వుతున్న పందెంకోళ్లు అంటూ గత నెల 26న ‘సాక్షి’ ఇచ్చిన కథనం నేడు నిజమైంది. మండల పరిధిలోని కోటపాడు, రంగంపేట పోలీస్‌ స్టేషన్ల మధ్య ఏడీబీ రోడ్డు నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో ఉన్న ఆయిల్‌ ఫామ్‌ తోటలో బుధవారం అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గుట్టు చప్పుడు కాకుండా భారీ ఎత్తున కోడి పందేలు ప్రారంభించారు. ఈ పందేల్లో ఉభయ గోదావరి జిల్లాల్లోని పందెగాళ్లు పాల్గొన్నట్టు తెలిసింది. పందేలు జోరుగా సాగుతున్న తరుణంలో బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పెద్దాపురం సీఐ యువకుమార్‌ ఆధ్వర్యంలో పెద్దాపురం, రంగంపేట, సామర్లకోట ఎస్సైలతో దాడులు జరపగా పలువురు పందెగాళ్లు చీకట్లో ఎటువెళుతున్నామో తెలియక పొలాల్లోకి పారిపోయి తెల్లారిన తరువాత చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో ఉంచిన తమ వాహనాల వద్దకు చేరుకుని మెల్లగా జారుకున్నారు. చీకట్లో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భీమవరానికి చెందిన ఒక వృద్ధుడి కాలికి గాయమైనట్టు చెబుతున్నారు. ఈ పందేల కోసం సుమారు 50 కార్లలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కార్లను సమీపంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్‌లు చేయించుకున్నారు.

పందేల నిర్వహణ వాస్తవమే..
కోడి పందేలపై నిర్వహణపై పెద్దాపురం సీఐ యువకుమార్‌ మాట్లాడారు. రాత్రి సమయంలో పందేలు జరగడం వాస్తవమేనని, తమకున్న సమాచారంతో దాడి చేశామని, ఈ దాడుల్లో చాలా మంది పారిపోగా ఆరుగురిని అరెస్టు చేశామని చెప్పారు. వారి నుంచి రూ.13,120 నగదు స్వాధీనం చేసుకున్నామని, రెండు కోళ్లు, తొమ్మిది కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. భారీగా కోడి పందేల నిర్వహణ వెనుక అధికార పార్టీ వ్యక్తుల ప్రమేయం ఉందని ఈ ప్రాంతం ప్రజలు అంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top