‘ఆరోగ్య బీమా’కు నిర్లక్ష్యపు జబ్బు | 'Health insurance' to the neglect disorder | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య బీమా’కు నిర్లక్ష్యపు జబ్బు

Oct 14 2013 2:48 AM | Updated on Aug 29 2018 4:16 PM

చేనేత కార్మికుల ఆరోగ్యానికి భద్రత కరువైంది. ఆరోగ్య బీమా కార్డుల గడువు ముగిసినా రెన్యువల్ చేయకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

 భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: చేనేత కార్మికుల ఆరోగ్యానికి భద్రత కరువైంది. ఆరోగ్య బీమా కార్డుల గడువు ముగిసినా రెన్యువల్ చేయకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికుల కోసం 2005లో కేంద్ర ప్రభుత్వం ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద జిల్లాలో 7,500 మంది చేనేత కార్మికులకు బీమా కార్డులు జారీ మంజూరు చేశారు. ఇందులో పోచంపల్లిలోనే 1,600 పైగా కార్డులు ఉన్నాయి.
 
 సెప్టెంబర్‌తో ముగిసిన గడువు..
 జిల్లా వ్యాప్తంగా 4,500 హెల్త్ కార్డుల గడువు జూలై నెలాఖరుకు ముగిసింది. దీంతో ప్రభుత్వం వాటిని సెప్టెంబర్ వరకు పొడగించింది. ఆ గడువు కూడా తీరి పదమూడు రోజులు గడిచిపోయింది. అయినా రెన్యువల్ కోసం నేటి వరకు దరఖాస్తులు స్వీకరించకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
 
 ముగిసిన ఒప్పందం
 కేంద్ర ప్రభుత్వం ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీతో కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎనిమిదేళ్లు వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఈ ఒప్పందం కూడా సెప్టెంబర్‌తో ముగిసింది. ఒప్పందాన్ని పునరుద్ధరించకపోవడంతో కార్డుల రెన్యువల్‌కు దరఖాస్తులు స్వీకరించడం లేదని ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ కోఆర్డినేటర్లు పేర్కొంటున్నారు.
 
 సంవత్సరానికి రూ.15వేలు..
 చేనేత కార్మికుడు, అతని భార్య, ఇద్దరు పిల్లలు ఈ పథకం ద్వారా వైద్య సేవలు పొందవచ్చు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 80 సంవత్సరాల వయసు గల వారికి ఈ పథకం వర్తిస్తుంది. చికిత్స నిమిత్తం ఏడాదికి ప్రభుత్వం రూ.15 వేలు చెల్లిస్తుంది. ఆదాయంలో 50 శాతం చేనేతపై సంపాదించే ప్రతి కార్మికుడు రూ.100 చెల్లించి కార్డు పొందవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం రూ.100 చెల్లించి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. సహకార, సహకారయేతర సంఘాలలో పనిచేసే వారిని కార్మికునిగా గుర్తించి చేనేత, జౌళి శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.
 
 రెన్యువల్ చేస్తలేరు
 గడువు తీరిన హెల్త్‌కార్డు వెంటనే రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. దరఖాస్తులు కూడా స్వీకరించకపోవడంతో మళ్లీ కార్డులొస్తాయో రావోనని ఆందోళనగా ఉంది.వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నాం. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపాలి.
 - పూల పెద్దులు, చేనేత కార్మికుడు, పోచంపల్లి
 
 
 ప్రభుత్వం ఆదుకోవాలి
 ప్రతిఏటా గడువు తీరిన వెంటనే రెన్యువల్ చేసేవారు. ఈ సంవత్సరం పభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని ఐసీఐసీఐ కోఆర్డినేటర్లు పేర్కొంటున్నారు. చాలా మంది చేనేత కార్మికుల హెల్త్ కార్డుల గడువు ముగిసింది. వారికి వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే స్పందించి కార్డులను రెన్యువల్ చేయాలి.
 - కర్నాటి అంజమ్మ, చేనేత కార్మిక సంఘం అధ్యక్షురాలు
 

Advertisement
 
Advertisement
Advertisement