ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకున్న వారికే గ్యాస్ సబ్సిడీ లభిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకున్న వారికే గ్యాస్ సబ్సిడీ లభిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేంత వరకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను నిలుపుదల చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న అభ్యర్ధనను సైతం తోసిపుచ్చింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది మహ్మద్ అబ్దుల్ గఫార్ ఆధార్‌పై గతవారం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీన్ని సోమవారం ధర్మాసనం విచారించింది. ఆధార్ కార్డుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్‌లో ఉన్నందున, తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆధార్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున, ఈ వ్యాజ్యాన్ని కూడా అక్కడకు బదలాయించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం పిటిషనర్‌కు రూ.500 జరిమానా విధించింది.