నిలుపుదలకు కారణం కనిపించట్లేదు | Grama Volunteers Recruitment Issue In High Court | Sakshi
Sakshi News home page

నిలుపుదలకు కారణం కనిపించట్లేదు

Jul 11 2019 3:21 AM | Updated on Jul 11 2019 9:38 AM

Grama Volunteers Recruitment Issue In High Court - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ వలంటీర్ల నియామకపు ప్రక్రియను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు ఎటువంటి కారణం కనిపించట్లేదని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ నిలుపుదల అభ్యర్థనతో దాఖలైన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. గ్రామ వలంటీర్ల నియామకాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, పురపాలకశాఖ, సాధారణ పరిపాలన శాఖ.. తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను రాష్ట్రంలో అర్హులైన ప్రతీ కుటుంబానికి చేర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామంలో గ్రామ వలంటీర్ల  నియామకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలతో ఇటీవల జీవో 104ను జారీ చేసింది.

ఈ జీవోను సవాలు చేయడంతోపాటు గ్రామ వలంటీర్ల నియామకపు ప్రక్రియను నిలిపేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన రాచగిరి బసవయ్య, మేడికొండూరుకు చెందిన దుడికి శివరామకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున మాజీ అడ్వొకేట్‌ జనరల్, సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. గ్రామ వలంటీర్లను కేవలం ఇంటర్వూ్యల ద్వారా ఎంపిక చేయడం సరికాదన్నారు. అంతేగాక ఏ గ్రామ వలంటీర్‌ ఆ గ్రామంలో పనిచేయడానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించడం సరికాదన్నారు.

గ్రామ వలంటీర్లు రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులు కారు...
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. కేవలం ఓ ఇద్దరు వ్యక్తులు మొత్తం నియామకపు ప్రక్రియను నిలిపేయాలని కోరడం సరికాదన్నారు. గ్రామ వలంటీర్లు రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులు కారని, వారికి జీతభత్యాలు ఉండవని, కేవలం గౌరవ వేతనం మాత్రమే అందుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఇంటికి చేర్చడమే వీరి నియామకం వెనుక ప్రధాన లక్ష్యమన్నారు. పదవ తరగతి, ఇంటర్‌ విద్యార్హతల ఆధారంగా ఇంటర్వూ్య చేసి, అందులో ప్రతిభ చూపినవారినే గ్రామ వలంటీర్లుగా ఎంపిక చేస్తారని, ఎంపిక ప్రక్రియ పూర్తవకుండానే దానిపై అభ్యంతరాలు లేవనెత్తడం సమంజసం కాదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాజస్థాన్‌ ప్రభుత్వం అమలు చేసిన ‘గ్రామ సహాయక్‌’ విధానాన్ని, దానిని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించడాన్ని వివరించారు. ఏ గ్రామంలో ఉండేవారు ఆ గ్రామ పరిధిలోనే పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంలో నిర్దిష్టమైన లక్ష్యం ఉందన్నారు.

ఏ గ్రామంలో ఉండేవారికి ఆ గ్రామంలోని ఇబ్బందులు తెలుస్తాయని, అలాగే ఆ గ్రామస్తులంతా తెలిసి ఉంటారని, ఆ గ్రామ స్వరూప స్వభావాలు కూడా తెలుస్తాయని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. పనితీరు ఆధారంగానే గ్రామ వలంటీర్ల కొనసాగింపు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ఈ పోస్టులకు కటాఫ్‌ మార్కులు లేవని, విద్యార్హతల ఆధారంగా, పలు అంశాల్లో వారికున్న విషయ పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నేరుగా వేతనాలు చెల్లించదని, పంచాయతీల ద్వారానే వారికి గౌరవ వేతనం అందుతుందని చెప్పారు. ఈ విధానం వల్ల తమకే విధంగా అన్యాయం జరిగిందో పిటిషనర్లు వివరించలేదన్నారు. ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి గ్రామ వలంటీర్ల నియామక ప్రక్రియను నిలుపుదల చేసేందుకు నిరాకరించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement