కొల్లేరు ప్రక్షాళనకు రెడీ

Government Wants to Clear Kolleru Pond Occupation - Sakshi

టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు  

8,800 ఎకరాల్లో అక్రమ చెరువుల గుర్తింపు

కొట్టివేతకు సిద్ధమవుతున్న అటవీశాఖ అధికారులు

ఏలూరు రూరల్‌ : టీడీపీ నేతల కబంధ హస్తాల నుంచి కొల్లేరు మరోసారి విముక్తి కానుంది. కొద్దిరోజుల్లో అటవీశాఖ అధికారులు కొల్లేరు ప్రక్షాళన చేపట్టబోతున్నారు. ఇందుకోసం అభయారణ్యంలో 8,800 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ చెరువులు గుర్తించారు. ఉన్నతధికారులు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఇన్‌చార్జి డీఎఫ్‌ఓ అనంత్‌శంకర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ చెరువులను గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యేల అనుచరుల పేదల పేరుతో అభయారణ్యంలో పెద్ద ఎత్తున అక్రమ చెరువులు తవ్వారు. చేపలు, రొయ్యల సాగు చేసే బినామీలకు లీజుకు కట్టబెట్టారు. ఐదేళ్లలో కోట్ల రూపాయలు దండుకున్నారు. అడ్డుచెప్పిన అటవీశాఖ అధికారులను దూషించారు. ప్రశ్నించిన అటవీశాఖ అధికారులను బదిలీ చేశారు. యథేచ్ఛగా సాగిన అక్రమాలతో టీడీపీ నాయకులు కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలంతా తమ అక్రమ సంపాదనకు గండి పడుతుందని భయపడుతున్నారు. 

10 గ్రామాల పరిధిలో భారీగా అక్రమ చెరువులు

కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఏలూరు, పెదపాడు, నిడమర్రు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని సుమారు 10 గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు వెలసినట్టు అ«టవీశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 4,403 ఎకరాలు అభయారణ్యంలో తవ్వగా మరో 4,396 ఎకరాల చెరువులు జిరాయితీ భూముల్లో తవ్వినట్టు అధికారులు గుర్తించారు.

ఆక్రమణల ఇలా.. 

మొండికోడు డ్రెయిన్‌ పరిసరాల్లో సుమారు 100 ఎకరాలకు పైగా పెద్ద ఎత్తున చెరువులు తవ్వారు. ఈ చెరువులను మాజీ సర్పంచ్‌లతో పాటు గ్రామ టీడీపీ నాయకులు వంతులు వేసుకుని చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏలూరు మండలం కలకుర్రు గ్రామంలో 100 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువు తవ్వకాలు జరిగాయి. కొట్టేసిన వందలాది ఎకరాలు చేపల చెరువులు నేడు మళ్లీ పూర్వస్థితికి చేరుకున్నారు. కాంటూరు దిగువన కొల్లేరులో వెలసిన ఈ గ్రామానికి చుట్టుపక్కల ఒక్క సెంటు రెవెన్యూ భూమి లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున అక్రమ చెరువులు వెలిశాయి. జాలిపూడి, మాదవాపురం రెవెన్యూ ప్రాంతాల మధ్య గతంలో కొట్టేసిన 200 ఎకరాలల్లో సొసైటీ చెరువును టీడీపీ నాయకులు తవ్వారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మిన్నకుండిపోయారు. ఈ ప్రాంతానికి పొక్లెయిన్లు, బుల్‌డోజర్లు తరలించేందుకు ఇప్పటికే రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. 

గండ్లను పూడ్చేసి సాగు

శ్రీపర్రు ఊరు వెనుక అభయారణ్యంలో గతంలో అధికారులు కొట్టేసిన చెరువుల గండ్లను కొందరు వ్యక్తులు పూడ్చేశారు. వందల ఎకరాల విస్త్రీర్ణంలో ఉన్న ఈ చెరువుల్లో పెద్ద సంఖ్యలో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. కోట్ల రూపాయలు విలువ చేసే చేపలు, రొయ్యలను టీడీపీ అనుయాయులు ఎగుమతి చేస్తున్నారు. జైపురం శివారున అభయారణ్య పరిధిలో 50 ఎకరాల విస్తీర్ణంలో పాత చెరువులకు గట్లు వేసి సాగు చేస్తున్నారు. ప్రత్తికోళ్లలంక, పెదయాగనమిల్లి, కోమటిలంక, కలకుర్రు, పైడిచింతపాడు తదితర గ్రామాల సమీపంలో సైతం కొల్లేరులో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ చెరువులు వెలిశాయి. ఈ చెరువులకు వేలం పాట నిర్వహించి టీడీపీ నాయకులు ఏటా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.

8 వేల ఎకరాల్లో అక్రమ చెరువులు

 అభయారణ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. కొల్లేరు పరిధిలో అక్రమ చెరువులపై నివేదికను తయారు చేశాం. వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు గుర్తించాం. గత మూడేళ్ల నుంచి వీటిలో చేపలు, రొయ్య ల సాగు జరుగుతోంది. సుమారు 8,000 వేలకు పైగా జిరాయితీ, అభయారణ్యంలో చెరువులు తవ్వినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.   – బి.రమణప్రసాద్, ఏలూరు రేంజర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top