వేతన వెతలు.. | Government employees facing problems with E- payment process | Sakshi
Sakshi News home page

వేతన వెతలు..

Mar 4 2014 11:26 PM | Updated on Mar 28 2018 10:59 AM

సర్కారు ఉద్యోగులకు ‘వేతన’ వెతలు తలెత్తాయి. ప్రభుత్వం తలపెట్టిన ఈ - చెల్లింపుల(ఎలక్ట్రానిక్ పేమెంట్) ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీనుంచి అమల్లోకి వచ్చింది.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  సర్కారు ఉద్యోగులకు ‘వేతన’ వెతలు తలెత్తాయి. ప్రభుత్వం తలపెట్టిన ఈ - చెల్లింపుల(ఎలక్ట్రానిక్ పేమెంట్) ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీనుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఖజానా విభాగం నుంచి చేయాల్సిన ప్రతి చెల్లింపులు ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. వేతనాలు, పెన్షన్లతో పాటు ఇతర పనులకు సంబంధించి చెల్లింపులన్నీ ఇకపై వ్యక్తిగత ఖాతాలోనే జమచేయనున్నారన్నమాట. పారదర్శకతలో భాగంగా చేపట్టిన ఈ ప్రక్రియ ఉద్యోగులకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఐదో తేదీ వస్తున్నా ఇప్పటివరకు జిల్లాలో పనిచేస్తున్న మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందలేదు.

 తప్పుల తడకగా వివరాల నమోదు
 జిల్లా ఖజానా శాఖ పరిధిలో 350మంది డీడీఓ (డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్)లు ఉన్నారు. వీరి పరిధిలో దాదాపు 6 వేల ఉద్యోగులున్నట్లు ఖజానాశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇవే  కాకుండా ఉప ఖజానా శాఖ అధికారుల పరిధిలో టీచర్లు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య తదితర శాఖలకు సంబంధించిన సిబ్బందికి వేతనాలు అందజేస్తున్నారు. తాజాగా మార్చి నుంచి జిల్లాలో ఈ - పేమెంట్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఆయా డీడీఓలు ఉద్యోగుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తదితర వివరాలను లాగిన్ ఐడీ నుంచి నమోదు చేయాల్సి ఉంటుంది.

 అయితే జిల్లాలో చాలాచోట్ల ఉద్యోగుల వివరాల నమోదు తప్పుల తడకలా సాగింది. దీంతో ఖజానాధికారి వివరాలకు, ఉద్యోగి వివరాలకు పొంతన కుదరకపోవడంతో చెల్లింపుల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఉద్యోగుల బ్యాంకుకు సంబంధించి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నమోదులో భారీగా తప్పులు దొర్లాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెలలో పెన్షన్ల చెల్లింపుల్లో సైతం జాప్యం జరిగింది. ప్రభుత్వం పెన్షనర్ల చెల్లింపులను ఈ నెల నుంచి ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ప్రధాన కార్యాలయాల నుంచి విడుదల చేసేలా చర్యలు చేపట్టింది. అయితే ఆన్‌లైన్ విధానంలో తలెత్తిన సమస్య కారణంగా వీరి చెల్లింపుల్లో అంతరాయం కలిగింది. సమస్యను పరిష్కరించిన వెంటనే చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 ఐటీ తంటా..
 తాజాగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఫిబ్రవరి నెలాఖరుతో ఆదాయపన్ను వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే మార్చి నెలనుంచి వేతనాలు విడుదల చేస్తారు. అయితే జిల్లా ఖజానా శాఖ పరిధిలో ఉన్న 350 డీడీఓల్లో కేవలం వంద మంది మాత్రమే వేతనబిల్లులు సమర్పించినట్లు ఖజానా శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో వీటిని పరిశీలించిన ఖజానా శాఖ సరైన వివరాలు సమర్పించిన వారికి వేతనాలు విడుదల చేశామని, కచ్చితమైన వివరాలతో బిల్లులు సమర్పించిన వారికి వెనువెంటనే క్లియర్ చేస్తామని డీటీఓ నాగరాజు ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement