అంతా.. ట్రిక్కే..!  | Government Declared Bio Metric Must In Junior Colleges | Sakshi
Sakshi News home page

అంతా.. ట్రిక్కే..! 

Aug 13 2019 10:51 AM | Updated on Aug 13 2019 10:52 AM

Government Declared Bio Metric Must In Junior Colleges - Sakshi

బయోమెట్రిక్‌ యంత్రంలో వేలిముద్ర వేస్తున్న విద్యార్థులు

అధ్యాపకులు లేకున్నా రిజిస్టర్లలో పేర్లుంటాయి..విద్యార్థులు లేకున్నా లెక్కల్లో చూపిస్తూ ప్రైవేట్‌ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అంతా మాయ చేస్తున్నాయి.. ఇదేమని అడిగేవారు లేకపోవడంతో బయోమెట్రిక్‌ విధానాన్ని యాజమాన్యాలు పక్కదోవ పట్టిస్తున్నాయి. విద్యార్థుల స్కాలర్‌ షిప్‌లు స్వాహా చేస్తున్నాయి. రూ.లక్షల్లో ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

సాక్షి, నెల్లూరు :   ఇంటర్‌ కళాశాలల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ యంత్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ప్రైవేట్, కార్పొరేట్‌ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఇంటర్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి విధిగా యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. అయితే జిల్లాలో ఏ ఒక్క కళాశాలలో కూడా బయోమెట్రిక్‌ యంత్రాన్ని ఏర్పాటు చేయలేదు. బయోమెట్రిక్‌ ఏర్పాటుకు నిరాకరిస్తే కళాశాల గుర్తింపు రద్దు చేస్తామన్న హెచ్చరికను కూడా వారు పెడచెవిన పెట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్‌ బోర్డు అధికారులు కళాశాలల్లో ఉన్న పరిస్థితులపై ప్రస్తుతం నోరు మెదపడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌ రూపంలో కొంత మొత్తాన్ని అందజేస్తున్నారు. బోగస్‌ హాజరుతో ప్రభుత్వం ఇచ్చే నిధులను కార్పొరేట్, ప్రభుత్వ యాజమాన్యాలు పక్కదారి పట్టిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 

దీంతో పాటు హాజరు తక్కువ ఉందని విద్యార్థుల నుంచి కొత్త మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాలో 126 కార్పొరేట్, 26 ప్రభుత్వ, 15 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి దాదాపు 60వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను ప్రతినెలా మంజూరు చేస్తుంది. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.325 చొప్పున 10 నెలలకు రూ.3,250 విడుదల చేస్తుంది. బోగస్‌ హాజరు చూపిస్తూ పలు కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ప్రతిరోజు కళాశాలలకు రావాల్సిన అవసరం ఉండదని, పాస్‌ చేయించే బాధ్యత తమదేనని గ్యారెంటీ ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులనుఎక్కువ మొత్తంలో చేర్చుకుంటున్నారు. వారు రోజు కళాశాలకు రాకపోయిన రికార్డుల్లో హాజరు చూపిస్తూ స్కాలర్‌షిప్పును ఎంచక్కా మెక్కేస్తున్నారు.

అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్‌ 
జూనియర్‌ కళాశాలల్లో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్‌ యంత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి విద్యార్థి ఆధార్‌ నంబరును బయోమెట్రిక్‌కు అనుసంధానం చేసింది. ప్రతిరోజు విద్యార్థి ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ హాజరును పరిగణలోకి తీసుకుని స్కాలర్‌షిప్పును ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్‌ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు ఆదేశించారు. కళాశాలలో పనిచేసే అధ్యాపకుల హాజరు సైతం బయోమెట్రిక్‌ ద్వారా తీసుకోవాలని తెలిపారు.

ఆర్‌ఐఓలే బాధ్యులు ...
జూనియర్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు ఏర్పాటు చేయకపోతే ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఓ)నే బాధ్యులు అవుతారని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం బయోమెట్రిక్‌ యంత్రాల అమలుపై ఎవరూ నోరు మెదపడం లేదు. ఇంటర్‌ బోర్డు అధికారులు సైతం పట్టించకోవడం లేదు. బయోమెట్రిక్‌ హాజరు లేకుండా ఏ ఒక్క కళాశాల నుంచి స్కాలర్‌షిప్పులకు దరఖాస్తులు స్వీకరించరాదని, పరీక్షల నిర్వహణకు, నామినల్‌ రోల్స్‌కు కూడా సిఫార్సు చేయవద్దని ఇంటర్‌బోర్డు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇంటర్‌  బోర్డు చెప్పినట్లు యంత్రాలు అమలు చేస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టేనని కొన్ని కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. మాన్యువల్‌ విధానం ఉంటే విద్యార్థులు వచ్చినా రాకున్నా హాజరు వేసుకుని స్కాలర్‌షిప్పు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవచ్చనే ఆలోచనలో ఇంటర్‌ కళాశాలల యాజమాన్యాలు ఉన్నట్లు తెలిసింది.

యంత్రాలు ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా నష్టదాయకమని భావించి వాటిని నిరాకరిస్తున్నారని సమాచారం. అయితే బయోమెట్రిక్‌ ద్వారా హాజరు పరిగణలోకి తీసుకంటే తమ పిల్లలు రోజు కళాశాలకు వెళుతున్నారా..లేదన్నది తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఒక్కో యంత్రం ధర రూ.30వేల నుంచి రూ.35వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉండగా  ప్రతి కళాశాలలో బయోమెట్రిక్‌ యంత్రం తప్పనిసరిగా బిగించాల్సిందేనని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి  కే శ్రీనివాసరావు, స్పష్టం చేశారు. ఏర్పాటు చేయనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement