డబ్బు కొట్టు.. పట్టా పట్టు! | Give money and take away house certificate | Sakshi
Sakshi News home page

డబ్బు కొట్టు.. పట్టా పట్టు!

Aug 17 2013 4:17 AM | Updated on Sep 1 2017 9:52 PM

‘ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల పట్టా కావాలా?... దాందేముందీ!... జస్ట్ రూ. 25 వేలు కొట్టండి. పట్టా పుచ్చుకోండి. అధికారి మామూళ్లు దీనికి అదనం సుమండీ!’ఇదండీ..

‘ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల పట్టా కావాలా?... దాందేముందీ!... జస్ట్ రూ. 25 వేలు కొట్టండి. పట్టా పుచ్చుకోండి. అధికారి మామూళ్లు దీనికి అదనం సుమండీ!’ఇదండీ.. ప్రస్తుతం ఒంగోలులో అధికార పార్టీ ఛోటా నేతలు దర్జాగా సాగిస్తున్న భూదందా. వీరు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వర్గీయులు కావడంతో ఓ రెవెన్యూ అధికారి భూదందాకు తనవంతు సహకారం అందిస్తున్నారు. పనిలో పనిగా తన జేబు కూడా నింపుకుంటున్నారు. ఈ కథ కమామిషు ఇదిగో ఇలా ఉంది...
 
ఆ నలుగురి చిలక్కొట్టుడు 
ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పేదలకు కేటాయించిన భూమిని ఎంపీ మాగుంట వర్గం చిలక్కొట్టుడు కొడుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 4,200 మంది పేదలకు 74 ఎకరాలు కేటాయించిన విషయం విదితమే. ఆ పేదల పట్టాలను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేసి ఎంపీ మాగుంట వర్గం తమవారికి కేటాయించేందుకు చేస్తున్న యత్నాలను ‘సాక్షి’ కొన్ని రోజుల క్రితం వెలుగులోకి తెచ్చింది. ఈ భూబాగోతంలో ఎంపీ మాగుంట వర్గం అక్రమాల పర్వం కొనసాగుతునే ఉంది. టోకుగా కాకుండా చిల్లరగా ఆ ఇళ్ల పట్టాలకు బేరం పెట్టింది. ఎంపీ మాగుంట వర్గంలో క్రియాశీలంగా వ్యవహరించే నలుగురు ఛోటా నేతలు ఈ భూబాగోతానికి సూత్రధారులు కాగా ఓ ఉన్నతాధికారి పాత్రధారిగా మారారు. ఆ  నేతలు ముందుగానే కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ద్వారా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేయించి సరే అనిపించారు. ఆ తరువాత పట్టా నంబర్ల వారీగా ఇళ్ల స్థలాలకు బేరం పెట్టారు.
 
ముందుగా 500 ఇళ్ల స్థలాలను ఎంపిక చేసుకుని బేరం పెట్టారు. ఒక ఇంటి స్థలం ఇప్పించేందుకు రూ. 25 వేలు వసూలు చేస్తున్నారు. ఆ విధంగా 400 ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే వసూళ్లు పూర్తి చేసేశారు. ఆ లెక్కన వారు ఇప్పటికే రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 100 ఇళ్ల స్థలాలకు కూడా వసూళ్లు పూర్తిచేసేసి పట్టాలు ఇప్పించాలన్నది వారి లక్ష్యం. ఇలా తమకు డబ్బులు ముట్టజెప్పినవారిని ఆ స్థలాల్లో పాకలు కూడా వేసుకోవచ్చని ఎంపీ మాగుంట అనుచరులు భరోసా ఇచ్చేస్తున్నారు. తమ లక్ష్యం మేరకు 500 ఇళ్ల స్థలాలను తమ పరం చేసుకున్న తరువాత రెండో విడతగా మరో 500 ఇళ్లస్థలాలకు గురిపెట్టాలన్నది ఆ నలుగురి వ్యూహం. ఎంపీ మాగుంట వర్గీయులు కావడం.. ఉన్నతాధికారి పూర్తిగా సహకరిస్తుండటంతో ఆ నలుగురి భూ దందా మూడు పట్టాలు ఆరు కబ్జాలుగా సాగిపోతోంది. 
 
రాజముద్రకూ ఓ రేటు 
మీ పని బాగానే ఉంది.. మారి నాకేంటంటా అని అడుగుతున్నారు ఓ అధికారి. ఎందుకంటే నిబంధనలను తుంగలో తొక్కుతూ.. కోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ సాగిస్తున్న ఈ భూదందాకు రాజముద్ర వేయాల్సింది ఆయనే మరి. అందుకే ఎంపీ మాగుంట వర్గీయులు ముందుగానే ఓ షరతు విధిస్తున్నారు. పట్టాలు చేతికి రావాలంటే ఆ అధికారినీ సంతృప్తిపరచాలని చెబుతున్నారు. ఇంకేముందీ... ఇదే అదనుగా ఆ అధికారి ఒక్కో పట్టాకు రూ. 10 వేలు చొప్పున గుంజుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఆయన కూడా ఇంతవరకూ దాదాపు రూ. 40 లక్షల వరకు గుంజుకున్నట్లు లెక్క తేలుతోంది. ఇంతగా జేబులు నిండుతుండటంతో ఆయన ఏకంగా ఎవర్నీ లెక్కచేయకుండా ఇష్టానుసారం పట్టాల జారీకి తెగించేస్తున్నారు. తమకు కేటయించిన పట్టాలను రద్దు చేయడంపై అర్హులైన లబ్ధిదారులు ఆయన్ని కలసి విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన వారి ఆవేదనను ఖాతరే చేయలేదు. పైగా ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని తేల్చిచెప్పేశారు. దాంతో అటు ఎంపీ మాగుంట వర్గీయులకు ఇటు ఉన్నతాధికారికి ఈ భూబాగోతం కాసులు కురుపిస్తోంది. 
 
వారిలో గుబులు.. వీరిలో దిగులు
ఎంపీ మాగుంట వర్గీయులు, అధికారికి డబ్బులు ముట్టజెప్పిన వారిలో ప్రస్తుతం గుబులు మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా తమ పట్టాలు రద్దు చేయడంతో అర్హులైన లబ్ధిదారులు న్యాయపోరాటానికి సిద్ధపడ్డారు. దీంతో ప్రస్తుతం ఎంపీ వర్గీయులకు డబ్బులు సమర్పించుకున్నవారు పునరాలోచనలోపడ్డారు. ఎందుకంటే ఆ ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా వారి పరం కాలేదు. కానీ ఇప్పటికే డబ్బులు ముట్టజెప్పి చేతి చమురు వదిలించుకున్నారు. దీంతో వారంతా ఇటీవల ఎంపీ మాగుంట అనుచరులను నిలదీశారు. పట్టాలు అయినా ఇప్పించండి.. లేకపోతే తమ డబ్బులు అయినా వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారు. దీంతో మాగుంట వర్గీయులు కొన్ని రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకుండా తప్పించుకుంటున్నారు. మరో 500 ఇళ్ల స్థలాలకు గురిపెడితే అసలుకే మోసం వచ్చిందేమోనని వారు గుబులు చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement