
తండ్రి అంతిమయాత్రలో విషణ్ణవదనాలతో కుమార్తె సమీర
సాక్షి, పిఠాపురం: బాలల దినోత్సవం వేళ ఆనందంగా గడపాల్సిన ఆ బాలికలు విషాదంలో మునిగిపోయారు. కంటికి రెప్పలా కాపాడే కన్న తండ్రి దూరమవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. పుస్తకాల బ్యాగ్ మోయాల్సిన ఆ చిట్టి చేతులు తండ్రి చితికి నిప్పుపెట్టేందుకు కుంపటి పట్టుకోవాల్సి వచ్చింది. అభంశుభం తెలియని ఆ పసిహృదయాలు తండ్రి లేడని, ఇక తిరిగి రాడని తెలిసి తల్లడిల్లిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. నిండా ఎనిమిదేళ్లు కూడా నిండని బాలిక తన తండ్రికి తలకొరివి పెట్టిన హృదయ విదారకర సంఘటన కొత్తపల్లి మండలం కొండెవరంలో గురువారం చోటుచేసుకుంది. కొరివి పెట్టడానికి కొడుకు లేడన్న బాధ లేకుండా తానే కొడుకై కన్న తండ్రి రుణాన్ని తీర్చుకుంది ఆ బాలిక.
తండ్రి చితికి తలకొరివి పెట్టి చితిమంట వద్ద విలపిస్తున్న సమీర
కొత్తపల్లి మండలం కొండెవరానికి చెందిన కొల్లు నరసింహమూర్తి, నూకరత్నం దంపతులకు సమీర(8), పద్మ (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో సమీర స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. రెక్కాడితేనే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే నరసింహమూర్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసి నిద్రించాడు. ఉదయం అందరూ లేచి అన్ని పనులు చేసుకుంటున్నారు. సమీరను పాఠశాలకు పంపేందుకు సిద్ధం చేసిన నూకరత్నం, నరసింహమూర్తి నిద్రలేవకపోవడాన్ని గమనించి లేపే ప్రయత్నం చేసింది. ఎటువంటి కదలిక లేకపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
ఆయన మృతదేహానికి తలకొరివి పెట్టడానికి మృతుడికి కొడుకులు ఇతర బంధువులు లేకపోవడంతో ఆ కార్యాన్ని తాను నిర్వర్తిస్తానంటూ పెద్ద కుమార్తె సమీర ముందుకొచ్చింది. తన స్కూల్‌యూనిఫాంతోనే తాను కొడుకుతో సమానం అంటు తండ్రి అంతిమయాత్రలో పాల్గొని తండ్రి చితికి నిప్పంటించి తలకొరివి పెట్టింది. అల్లారుముద్దుగా చూసుకునే నాన్నకు తానే తలకొరివి పెట్టాల్సి వచ్చిందంటూ ఆ చిన్నారి కన్నీటిపర్యంతమైన తీరు అందరితో కంటతడి పెట్టించింది.