అయ్యో పాపం

Girl Childs Percentage Down Fall in Vizianagaram - Sakshi

తగ్గిపోతున్న బాలికల సంఖ్య

ఆడపిల్లలపై కొనసాగుతున్న వివక్ష

గుట్టుగా లింగ నిర్థారణ పరీక్షలు

ఆడపిల్లగా తేలితే గర్భ విచ్ఛిత్తి

పదేళ్లలో ఒక్క కేసు నమోదు లేదు

పట్టించుకోని వైద్యశాఖాధికారులు

విజయనగరం ఫోర్ట్‌: ఆడపిల్లల సంఖ్య జిల్లాలో తగ్గిపోతోంది. ఆరేళ్లలోపు పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావించే రోజులు పోయి భారమనే రోజులు వచ్చాయి. ఆడపిల్లలను వద్దనుకునే వారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. ఇటీవల కాలంలో శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వేను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్వహించారు. ఈ సర్వేలో 1000 మంది బాలురకు 955 మంది బాలికలున్నట్టు తేలింది. ఆరేళ్ల లోపు బాలికల సంఖ్య తగ్గిపోతుండటం గమనార్హం.

శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఆడ, మగ వివక్ష సమాజంలో పెరుగుతోంది. ప్రస్తుతం పురుషుల కంటే స్త్రీలు ఏరంగంలో తీసిపోవడం లేదు. అన్ని రంగాల్లోనే రాణిస్తున్నారు. కానీ కొడుకు అయితే వారసుడవుతాడని.. కుమార్తె అయితే వివాహం చేసుకుని వెళ్లిపోతుందన్న భావనతో కొందరు తల్లిదండ్రులు వివక్ష చూపుతున్నారు. గర్భంలో పెరిగేది ఆడపిల్లో, మగ పిల్లాడో స్కానింగ్‌ ద్వారా తెలుసుకుని ఆడపిల్ల అయితే పురిటిలోనే హతమారుస్తున్నారు. ఫలితంగా జిల్లాలో బాలికల సంఖ్య తగ్గిపోతోంది.

నమోదు కాని కేసులు
జిల్లాలో 62 ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లు, 13 ప్రభుత్వాస్పత్రుల్లో స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. స్కానింగ్‌ సెంటర్లను వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేసి లింగ నిర్థారణ వెల్లడిస్తున్నారా లేదా పరిశీలించాలి. కానీ తూతు మంత్రంగానే చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదేళ్ల కాలంలో స్కానింగ్‌ సెంటర్లపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీన్ని బట్టే అధికారుల తనిఖీలు ఏరీతిన జరిగాయో అర్థమవుతుంది.

తగ్గుతున్న బాలికల సంఖ్య
జిల్లాలో ఆరేళ్ల లోపు బాలురు, బాలికల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కొన్ని మండలాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. బొబ్బిలి, సీతానగరం, బలిజిపేట, సాలూరు తదితర మండలాల్లో బాలికల సంఖ్య తక్కువగా ఉంది.

నాకు తెలియదు
ఏ స్కానింగ్‌ సెంటర్‌ లోనైనా  లింగ నిర్ధారణ జరుగుతున్నట్టు సమాచారం ఇస్తే డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించి తనిఖీలు చేపడతాం. నేను విధుల్లో చేరి  ఏడాది కావస్తుంది. పదేళ్లుగా స్కానింగ్‌ సెంటర్లపై కేసులు నమోదు చేయని విషయం నాకు తెలియదు. లింగ నిర్ధారణ నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటాం.              – కె.విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ

జిల్లాలో బాలురు, బాలికల మధ్య వ్యత్యాసం
బాలురు  ప్రతి 1000 మందికి బాలికలు 955 మంది
ఆరేళ్ల లోపు బాలురు ప్రతి 1000 మందికి బాలికలు 955

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top