స్కానింగ్ కేంద్రాల వద్ద పుట్టబోయే బిడ్డ గురించి చెప్పాలని ఒత్తిడి చేసినా, లింగ నిర్ధారణ చేసినా చట్టరీత్యా నేరమని జిల్లా విస్తరణ మాధ్యమికాధికారి
లింగ నిర్ధారణ నేరం
Dec 13 2013 3:02 AM | Updated on Sep 15 2018 3:43 PM
బొబ్బిలి, న్యూస్‌లైన్: స్కానింగ్ కేంద్రాల వద్ద పుట్టబోయే బిడ్డ గురించి చెప్పాలని ఒత్తిడి చేసినా, లింగ నిర్ధారణ చేసినా చట్టరీత్యా నేరమని జిల్లా విస్తరణ మాధ్యమికాధికారి జయప్రసాద్ అన్నారు. బొబ్బిలిలోని ఎన్జీఓ హోంలో బొబ్బిలి ఎస్‌పీహెచ్‌ఓ ఆధ్వర్యంలో ఉండే అన్ని పీహెచ్‌సీల సిబ్బందికి గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 65 వేల మంది ఆరేళ్ల లోపు బాల బాలికలు ఉన్నారన్నారు. వీరిలో మగపిల్లలు 54 శాతం మంది ఉన్నారన్నారు. బాలికల నిష్పత్తి తక్కువగా ఉందని, గర్భస్థ దశలోనే ఆడ పిల్లలను తొలగించడమే దీనికి కారణం అన్నారు.జిల్లాలో 48 స్కానింగ్ కేంద్రాలున్నాయని, వాటిలో నాలుగు ప్రభుత్వానికి చెందినవన్నారు.
ప్రతి స్కానింగు కేంద్రం వద్ద లింగ నిర్ధారణ గురించి వచ్చే వారికి అవగాహన కల్పిస్తూ హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. కడుపులో ఉండే బిడ్డ గురించి బంధువులు ఎంత ఒత్తిడి చేసినా నిర్ధారించకూడదని, అలాగే ఒత్తిడి చేసే వారిపై కూడా కేసులు నమోదువుతాయన్నారు. స్కానింగు కేంద్రాల రిజిస్ట్రేషను సర్టిఫికెట్ కేంద్రం బయట, మిషన్ వద్ద కచ్చితంగా ఉంచాలన్నారు. నిర్ధారణ గురించి తెలుసుకోవాలన్నా, చెప్పినా రూ.50 వేల నుంచి లక్షరూపాయల వరకూ జరిమానా, 3 ఏళ్ల కారాగార శిక్ష ఉంటుందని హెచ్చరించారు. అలాగే వీరిపై బెయిల్‌లేని, రాజీ లేని కేసులు నమోదవుతాయన్నారు. వైద్య సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు ఎప్పటికప్పుడు స్కానింగు కేంద్రాలను తనిఖీ చేయాలని, హెచ్చరిక బోర్డులు, లెసైన్స్‌లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు ఎక్కడ ఎటువంటి అనుమానాలు వచ్చినా 08922 234553 నంబరును సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంటువ్యాధుల విభాగం ఇన్‌చార్జి వి చంద్రశేఖరరాజు, ఎస్‌పీహెచ్‌ఒ శ్రీహరి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement