ఐటీగ్రిడ్స్‌ ప్రకంపనలు : ఐటీ కార్యదర్శికి ఈఏఎస్‌ శర్మ లేఖ

Former Secretary To GOI Writes Letter To It Ministry Over Data Theft - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ర్టాలకు చెందిన 7.82 కోట్ల మంది ఆధార్‌ డేటా, ఓటర్‌ ఐడీ సహా వ్యక్తిగత వివరాలు టీడీపీ యాప్‌ను డెవలప్‌ చేసిన ఐటీగ్రిడ్స్‌ వద్ద ఉన్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించడంపై భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ కేంద్ర సమాచార సాంకేతిక (ఐటీ) మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. డేటా చోరీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐటీగ్రిడ్స్‌ వద్ద 7.82 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ఉండటం ఆందోళనకరమని ఐటీ కార్యదర్శి సాహ్నీకి రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు.

ఐటీగ్రిడ్స్‌ అభియోగాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు యూఐడీఏఐ, ఈసీ తీవ్రంగా పరిగణించాలని కోరారు. యూఐడీఏఐ, ఈసీఐల పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతను ఐటీగ్రిడ్స్‌ దెబ్బతీసిందని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కధనాన్ని ఉటంకిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మటికీ పౌరుల వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనేనని పేర్కొన్నారు. ప్రైవేట్‌ సంస్థ డేటా చోరీతో ఏ రాజకీయ పార్టీ దాన్ని దుర్వినియోగం చేసిందనే వ్యవహారంతో సంబంధం లేకుండా యూఐడీఏఐ, ఈసీలు తెలుగు ప్రజలకు సంతృప్తికర వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.డేటా చోరీ, ఐటీ గ్రిడ్స్‌ నిర్వాకంపై యూఐడీఏఐ, ఈసీలు తమ బాధ్యత నుంచి తప్పించుకోజాలవన్నారు.

యూఐడీఏఐ చైర్మన్‌ జే సత్యనారాయణ, ఏపీలో టీడీపీ ప్రభుత్వ ఈ గవర్నెన్స్‌, ఐటీకి సీనియర్‌ సలహాదారుగా వ్యవహరిస్తుండటంపై గతంలో తాను రాసిన లేఖను సమాచార సాంకేతిక శాఖ విస్మరించిందని శర్మ గుర్తుచేశారు. తెలుగు రాష్ర్టాల ప్రజల వ్యక్తిగత వివరాలను నిక్షిప్తం చేసిన ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో స్ధానిక యూఐడీఏఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసులో సరిపోదని పేర్కొన్నారు. యూఐడీఏఐ అధికారుల ప్రమేయం లేకుండా ఐటీగ్రిడ్స్‌ 7.82 కోట్ల మంది ఆధార్‌ వివరాలు, ఓటర్‌ ఐడీ వంటి డిజిటల్‌ రికార్డులను సమీకరించడం సాధ్యం కాదని అన్నారు. ప్రైవేట్‌ కంపెనీతో కుమ్మక్కై ఈ తతంగంలో పాలుపంచుకున్న యూఐడీఏఐ అధికారులందరిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ ప్రమేయం ఉందని తేలితే ఆయా బాధ్యులపైనా కేసు నమోదు చేయాలన్నారు. ఐటీగ్రిడ్స్‌ వ్యవహారంలో సరైన చర్యలు చేపట్టడంలో ఐటీ మంత్రిత్వ శాఖ విఫలమైతే తాము న్యాయస్ధానాలను ఆశ్రయించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top