ట్యూన్‌..అయ్యేనా?

Fishermans want to Boats For Hunting Tuna Fish - Sakshi

డీప్‌ సీలో ట్యూనా చేపలు లభ్యం

వాటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌

విదేశీ ఎగుమతులకు కూడా అవకాశం

స్టీల్‌ బోటు ఉంటేనే వేటకు అనుమతి

కాగితాలపైనే యూనిట్లు

అనధికారికంగా డీప్‌ సీలోకి మత్స్యకారులు

ఒంగోలు టౌన్‌: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మత్స్యకారులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సాధారణంగా పది నుంచి పదిహేను కిలోమీటర్ల లోపలికి వెళ్లి వేట సాగిస్తే చేపలు ఎక్కువగా పడుతుంటాయి. ప్రస్తుతం ఎంతసేపు వేట సాగించినా చేపలు తక్కువగానే పడుతున్నాయి. కొంతమంది మత్స్యకారులు అనుమతికి మించి సముద్రం లోపలికి వెళ్లి వేట సాగిస్తున్నారు. డీప్‌ సీలోకి వెళ్లి వేటాడుతున్నారు. డీప్‌ సీలో ట్యూనా చేపలు ఎక్కువగా పడుతుంటాయి. వాటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. చైనా, జపాన్‌ దేశాలకు భారత్‌ నుంచి ట్యూనా చేపలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. ట్యూనా చేపలు భారత కరెన్సీ ప్రకారం చూస్తే కేజీ వెయ్యి రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇంతటి డిమాండ్‌ ఉన్న ట్యూనా చేపలు పట్టుకునేందుకు మత్స్యకారులు సాహసం చేస్తున్నారు. డీప్‌ సీలోకి వెళ్లి వేట సాగించాలంటే ప్రస్తుతం మత్స్యకారులు ఉపయోగిస్తున్న పడవలు అనుకూలించవు.

ఆదాయం కోసం మత్స్యకారులు సాహసం చేస్తూ డీప్‌ సీలోకి వెళ్లి ట్యూనా చేపలు పట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డీప్‌ సీలోకి వెళ్లి ట్యూనా చేపలు పట్టుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన స్టీల్‌ బోట్లను వినియోగిస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నిజాంపట్నంలోనే స్టీల్‌ బోట్లు ఉన్నాయి. ఎంతో ఖరీదైన ఈ స్టీల్‌ బోట్లను మత్స్యకారులకు రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంత జిల్లాలకు యూనిట్లు కేటాయించింది. అందులో భాగంగా జిల్లాకు 20 యూనిట్లను కేటాయించింది. ఒక్కో స్టీల్‌ బోటు 70 నుంచి 80 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ స్టీల్‌ బోటును 40 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు అందించాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం మత్స్యకారులు గ్రూపుగా ఏర్పడి తమ సొంత డబ్బుతో లేదా బ్యాంకు రుణంగా పొందేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇంత వరకూ ఒక్క యూనిట్‌ను కూడా మంజూరు చేయలేదు. కాగితాలపైనే యూనిట్లు కదులుతూ ఉండటం గమనార్హం. విషయం తెలుసుకొన్న కొంతమంది మత్స్యకారులు మత్స్యశాఖ అధికారులను స్టీల్‌ బోట్ల విషయమై అడుగుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో వారు కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top