కిచ్చాడలో జ్వరాల పంజా

Fever In Kichoda - Sakshi

కురుపాం : మండలంలోని కిచ్చాడ గ్రామంలో జ్వరాలు పంజా విసిరాయి. గ్రామంలోని పలువురు మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో మంచమెక్కారు. ఇంటికొక్కరు, ఇద్దరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో పాటు విష జ్వరాల బారిన పడ్డారు.

ప్రస్తుతం గ్రామంలో గవర రాజ్యలక్ష్మి, బాలాజీ, గవర హేమంత్, జి.హర్షవర్ధన్, వరుణ్‌తేజ్, శారద, బెవర రమణ, ఎట్టి గంగ, పామల సోములు, టి.సింహాచలం, పి.చైతన్య, ఎ.సాయితో పాటు మరో పది మంది మలేరియా, విష జ్వరాల బారిన పడి బాధపడుతున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పేదలు అందుబాటులో ఉన్న సంచి వైద్యులను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.  

ఇద్దరికి డెంగీ...

గ్రామంలో వారం రోజుల కిందట ఒకరికి తీవ్ర జ్వరం రాగా మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తీసుకువెళ్లగా డెంగీ అని వైద్యులు గుర్తించినట్టు తెలిసింది. మరో మహిళ డి.సునీత తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఎప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో పాటు ప్లేట్‌లెట్స్‌ స్థాయి తగ్గిపోవడంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించగా ఆమెకు కూడా డెంగీ ఉన్నట్టు వైద్యాధికారులు గుర్తించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

 మలేరియా వచ్చిందా....

ఇదిలా ఉండగా వారం రోజులుగా కిచ్చాడ గ్రామంలో పలువురు వ్యక్తులు మలేరియా జ్వరాల బారిన పడి జియ్యమ్మవలస మండలం పెదమేరంగి కూడలిలో ఉన్న ఓ ప్రైవేటు వైద్యుడును ఆశ్రయించగా ఆ మలేరియా జ్వరం వస్తే చాలు నయం చేయటానికి రూ.3000 వసూలు చేస్తున్నట్టు  ఇదివరలో చికిత్స పొందిన  బాధితులు చెబుతున్నారు. అసలే పేదరికంతో ఉన్న వీరు ఆర్థికంగా చితికిపోతున్నారు.

ఇదిలా ఉండగా వైద్యాధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచే చర్యలు వెంటనే చేపట్టాలని వారు కోరుతున్నారు. లేకుంటే మరింత మంది జ్వరాల బారిన పడడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.   
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top