కొనుగోలు కేంద్రాలు తెరచి ధాన్యం కొనడం మరిచారు

Farmers are being Complaining of Trouble  - Sakshi

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఫిర్యాదు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి చెప్పారు. రైతు సమస్యలపై చర్చించేందుకు సోమవారం అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులతో కలిసి ఆయన పౌరసరఫరాల కమిషనర్‌ డి.వరప్రసాద్‌ను కలిశారు. క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతిపత్రమిచ్చారు. మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తీసుకెళ్లి రైతులే విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని దీంతో రైతు నష్టపోయి మిల్లర్లు లాభపడుతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర నామమాత్రంగా కూడా రైతుకు దక్కడం లేదని ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించినా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్తే గోనె సంచులు లేవని అక్కడి సిబ్బంది చెప్పడమే కాకుండా సంచులను మిల్లర్ల వద్ద తెచ్చుకోవాలంటూ సూచిస్తున్నారని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యాన్ని మిల్లర్లు నేరుగా కొనుగోలు చేస్తున్నందున బస్తాకు దాదాపు రూ.200 రైతులు నష్టపోతున్నారన్నారు.

ఒకవైపు అకాల వర్షాలు మరోవైపు తుపాను వస్తుందనే వార్తలతో రైతులు కలవర పడుతూ చేసేది ఏమీలేక ఎంతో కొంతకు ధాన్యాన్ని తెగనమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని విధిగా కొనుగోలు చేయాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే అలాంటి వారిపై
క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని రైతు సంఘం నేతలకు కమిషనర్‌ హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top