
సదుం: సర్వే బృంద సభ్యులను ప్రశ్నిస్తున్న గ్రామస్తులు
చిత్తూరు, సదుం: ఎస్‌ఎంపల్లెలో ఓ సర్వే బృంద సభ్యులు ఆదివారం పర్యటిం చారు. గ్రామస్తులు వెంటనే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని సర్వే బృంద సభ్యులను ప్రశ్నించారు. వారి వద్ద చీటీల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ అంటూ పేర్లు రాసి, ఫోన్ నంబర్లు ఉండడంపై ఆరా తీశారు. హైదరాబాదుకు చెందిన సోషల్ పోస్ట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ తరఫున సర్వే చేస్తున్నట్టు వారు బదులిచ్చారు.
చిన్నపాటి చీటీల్లో ఎందుకు వివరాలు నమోదు చేస్తున్నారని ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో వారిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అక్కడి నుంచి నిష్క్రమించడంతో వివాదం సద్దుమణిగింది. సెల్‌ఫోన్ నంబర్లు, ఓటర్ ఐడీ, ఆధార్ వివరాలు ఇవ్వడం వల్ల ఓట్లను తొలగించే అవకాశం ఉందని పెద్దిరెడ్డి గ్రామస్తులకు సూచించారు. ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన చెప్పారు.