కల్తీ మద్యం సీసాల పట్టివేత

Excise Officials Seized Fake Liquor Bottles - Sakshi

అనూ వైన్స్‌లో గుట్టుగా విక్రయిస్తున్న గుమస్తా

నిఘా వేసి పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు

కావలిరూరల్‌ : పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో కల్తీ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చెన్నకేశవులు తన బృందంతో దాడి చేసి గురువారం పట్టుకున్నారు. కావలిలోని పలు మద్యం దుకాణాల్లో మద్యాన్ని డైల్యూట్‌ చేసి విక్రయిస్తున్న ట్లుగా కొంతకాలంగా ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని అను వైన్స్‌పై అధికంగా ఫిర్యాదులు అందడంతో ఎక్సై జ్‌ అధికారులు గురువారం నిఘా పెట్టారు. ఉదయం షాపు తెరిచిన వెంటనే గుమస్తా లోపలికి వెళ్లి షట్టర్‌ను మూసివేశాడు. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌ను ఓపెన్‌ చేసి అందులో 30 మి.లీ.ల మద్యాన్ని బయటకు తీసి అంతే పరిమాణంలో నీటిని నింపి తిరిగి సీల్‌ను యధాతథంగా బిగించి పెట్టాడు.

రబ్బర్‌ ట్యూబ్‌ ముక్కతో బాటిల్‌ మూతను చాకచక్యంగా తీసి కల్తీ చేశాక, అంతే చాకచక్యంగా అమర్చాడు. మద్యం విక్రయించే సమయం కాగానే షాపును ఓపెన్‌ చేసి తొలుత కల్తీ చేసిన మద్యాన్ని విక్రయించడం మొదలు పెట్టాడు. ఎక్సైజ్‌ సిబ్బంది కస్టమర్‌లా వెళ్లి క్వార్టర్‌ బాటిల్‌ కొనుగోలు చేసి హైడ్రోమీటర్‌తో పరీక్షించగా  25 శాతం ఉండాల్సిన నీటి పరిమాణం 37 శాతంగా ఉంది. దీంతో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో షాపుపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్తీ జరిగిన ఇంపీరియల్‌ బ్లూ మద్యం 25 క్వార్టర్‌ బాటిళ్లు, ఓటీ విస్కీ 12 క్వార్టర్‌ బాటిళ్లు మొత్తం 37 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గుమస్తా బడెకల శ్రీనును అరెస్టు చేశారు. షాపు యజమాని మందాడి హర్షవర్ధన్‌పై కేసు నమోదు చేశారు.  ఈ దాడుల్లో ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్, కావలి ఎక్సైజ్‌ ఎస్సై ఎస్‌ శ్రీని వాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

డైల్యూషన్‌  ఇలా..
మద్యంలో 25 శాతం వరకు నీటి పరిమాణం ఉంటుంది. నిబంధనల ప్రకారం అంతకు మించి ఉండరాదు. అయితే సీసాలో కొంత మేర మద్యం తీసి వేసి అందులో నీటిని  ని ంపుతారు. ఇలా మద్యాన్ని నీటితో కల్తీ చేయడాన్ని డైల్యూషన్‌ అంటారు. అలాగే ఇంకో విధానంలో క్వార్టర్‌ అధికంగా ఉండే ప్రీమియం బ్రాండ్స్‌ మద్యంలో తక్కువ రకం మద్యాన్ని కలుపుతారు. మద్యం వ్యాపారులు  లాభాల కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. 
 

ఫిర్యాదు చేస్తే చర్యలు
మద్యం అమ్మకాలలో ఎలాం టి అవకతవకలను ఉపేక్షించమని  ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చెన్నకేశవులు పేర్కొన్నారు. కావలి ఎక్సైజ్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపామన్నారు. ఇటీవల 59 బెల్టు దుకాణాలపై దాడులు చేశామన్నారు. మద్యం సరఫరా చేసిన మద్యం షాపు యజమానులపైన కేసులు నమోదు చేశామన్నారు. మద్యం వ్యాపారులు లాభాల కోసం అడ్డదారులు తొక్కితే ఉపేక్షించేది లేదన్నారు.  ఎక్కడైనా బెల్టుషాపులు ఉన్నా, మద్యం కల్తీ జరుగుతున్నా, ఎమ్మార్పీ కంటే ఎక్కువకు  అమ్ముతున్నా, సమయ పాలన పాటించకపోయినా 94409 02264 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top