బంగారు తెలంగాణను సాధిస్తాం | electricity employees decided to play vital role to re - construct telanagana state | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణను సాధిస్తాం

Nov 21 2013 2:12 AM | Updated on Sep 2 2017 12:48 AM

బంగారు తెలంగాణను సాధిస్తాం

బంగారు తెలంగాణను సాధిస్తాం

నిజాయితీతో పనిచేయడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్: నిజాయితీతో పనిచేయడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ప్రకటించారు. తద్వారా బంగారు తెలంగాణ సాధిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం (టీవా) ఆవిర్భావ సభ ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగింది. తెలంగాణ ఏర్పాటు ఖాయమన్న విషయం సీఎంకు ముందే తెలుసని ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు నిధులను మళ్లిస్తున్నారని, అదేమైనా ఆయన అబ్బసొత్తా అని ప్రశ్నించారు. తెలంగాణపై రాజకీయ నిర్ణయం జరిగిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ ఇస్తే నక్సలైట్లు పెరిగిపోతారని ప్రచారం చేస్తున్నారని.. వాళ్లేమైనా పిశాచాలా అని నిలదీశారు. నిజమైన పిశాచాలు కాంగ్రెస్ నాయకులే అని విమర్శించారు.
 
  తెలంగాణలో విద్యుత్‌రంగంపై సీఎం విషం చిమ్ముతున్నారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (టీజాక్) కో-ఆర్డినేటర్, టీవా గౌరవ సలహాదారు కె. రఘు విమర్శించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణలోనే ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. నిజాయితీతో పనిచేయడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తామని ఆయన ప్రకటించారు. సీమాంధ్ర పత్రికలు, టీవీలు తెలంగాణ ప్రజల మెదళ్లలో విషం నింపుతున్నారని తెలంగాణ జర్నలిస్టు ఫోరం కన్వీనరు అల్లం నారాయణ మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన సంతోషం కూడా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
  తెలంగాణలో విద్యుత్‌రంగ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని టీవా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్ కుమార్, శ్రీనివాస్‌లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యు నేత సంధ్య, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాసగౌడ్, దేవీప్రసాద్, విఠల్‌తో పాటు టీవా నేతలు ఆరుద్ర, ముస్తాక్, సాయిలు, నర్శింహులు, కల్పన తదితరులు పాల్గొన్నారు.
 సంక్షేమం, అభివృద్ధి నాణేనికి రెండు ముఖాలు: కోదండరాం
 ఊర్లో దుకాణం పెట్టి ఊరంతటినీ బాగు చేశానన్నట్టుగా సీఎం వైఖరి ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం. కోదండరాం ఎద్దేవా చేశారు.
 
  టీవీ సభలో పొల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సమస్యల వివరిస్తున్న సీఎంకు, తెలంగాణలో ఆత్మహత్యలు పట్టవా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు అధిక జీతాలు ఇవ్వడం వల్లే సంక్షేమ పథకాలు నిధుల కొరత ఏర్పడిందని చెప్పి.. చంద్రబాబు ప్రజలు, ఉద్యోగుల మధ్య విభజన తెచ్చారన్నారు. ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి రెండూ ఒక నాణేనికి రెండు ముఖాలని, దీనిని గుర్తించి ఈ సంఘాన్ని స్థాపించడాన్ని ఆయన ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంఘం వార్షికోత్సవ పోస్టర్‌ను జేఏసీ కార్యాలయంలో కోదండరాం ఆవిష్కరించారు. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ వివక్ష వల్లే ప్రతిష్టాత్మకైన సంస్థలు మూతపడ్డాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాదు సత్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement