ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ముగింపుతో జిల్లా వ్యాప్తంగా ఈద్ ఉల్ ఫిత్‌న్రు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ముగింపుతో జిల్లా వ్యాప్తంగా ఈద్ ఉల్ ఫిత్‌న్రు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని బారా షహీద్ దర్గా, ఈద్గా మైదానంలో పదివేల మందికి పైగా ముస్లింలు ఉదయం 10 గంటలకంతా చేరుకుని ప్రత్యేక నమాజ్‌ను పూర్తిచేశారు. అనంతరం స్నేహితులు, కుటుంబీకులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలను తెలుపుకున్నారు.
నెల్లూరు (కల్చరల్) : రంజాన్ ప్రార్థనల్లో భాగంగా ఈద్గా ఇమామ్ ఖతీబ్ సయ్యద్ అబూబకర్ అషఫ్రి సాబిరి జిల్లా ప్రజలకు సందేశం ఇచ్చారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు పాటించి, ప్రత్యేక తరహా నమాజులలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆ అల్లా దయ కలుగుతుందన్నారు. దైవాజ్ఞ మేరకు తమ సంపాదనలో నిర్ణీత జకాత్‌ను చెల్లించడంలో ప్రతిఒక్కరూ ఆసక్తి చూపాలన్నారు. మనుషులు చేసుకున్న పాపాలను అల్లాహ్ క్షమించి, నరకాగ్ని నుంచి విముక్తి కలిగించి జీవితాన్ని సన్మార్గంలో నడిపించాలని కోరుకున్నారు. దేశశాంతి, విశ్వశాంతి కోసం అల్లాహ్‌ను వేడుకుని ప్రత్యేక దువా చేశారు. ఇస్లాం ఆవిర్భవించింది సర్వమానవాళి సన్మార్గంలో నడిపేందుకు, విశ్వశాంతి స్థాపించేందుకు అని పేర్కొన్నారు.
సర్వమానవుల పట్ల పరస్పర సోదరభావం పెంచేందుకు ఇస్లాం కృషి చేస్తోందన్నారు. దుర్మార్గం, హింస, దురాచారాలు, తోటిమానవులపై దౌర్జన్యాలను ఇస్లాం సహించదు అని తెలిపారు. పరమత ద్వేషంతో మానవ ఐక్యతకే పెను ప్రమాదం వాటిల్లుతుందన్నారు. ప్రాంతీయత అనే అంశంతో దేశ ఐక్యతను, జాతి శక్తిని దెబ్బతీస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమస్యలన్నింటికీ ఇస్లాంలో పరిష్కారమార్గాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఇస్లాంను తెలుసుకుని విశ్వాసపరులుగా మారినపుడు విశ్వశాంతి చేకూరుతుందని తెలిపారు.
ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యేలు..
బారాషహీద్ దర్గా ఈద్గాలో శనివారం జరిగిన ఈద్ ఉల్ ఫితర్ నమాజులో నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆశిస్తూ దువా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రంజాన్ ప్రతి ఒక్కరిలో మంచి గుణాలను పెంచి, చెడు అలవాట్లను దూరం చేసే పవిత్రమైన ఈద్‌గా అని తెలిపారు. ప్రార్థనల అనంతరం ముస్లింలను ఆలింగనం చేసుకుని ఆనందోత్సాహాలు మధ్య పండగ శుభాకాంక్షలను తెలిపారు.
నగర మేయర్ అజీజ్, నగర పాలక సంస్థ కమిషనర్ ఈద్గాకు విచ్చేసిన భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. నగర డీఎస్పీ మగ్బూల్ ఆధ్వర్యంలో ఈద్గా ప్రాంగణంలో పోలీసులు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండడంతో నగరంలో ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు.