ఈ రబీ నుంచే ఈ-కర్షక్‌

E Karshak Application For Farmers In Andhra Pradesh - Sakshi

యాప్‌లో నమోదు చేసుకుంటే చాలు బీమా వర్తింపు

వ్యవసాయశాఖ సరికొత్త మార్గదర్శకాలు

ఆరుగాలం కష్టించి పండించిన పంట ప్రకృత్తి విపత్తుల వలనో మరేఇతర కారణంగానో చేతికందకుండా పోతే ఆ రైతు బాధ వర్ణనాతీతం. దురదృష్టవశాత్తు ప్రతి యేడాదీ రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.. ఒకసారి అనావృష్టి, మరోసారి అతివృష్టితో పంట నష్టం జరిగి విలవిలలాడుతున్నారు. అయితే వారికి సాంత్వన నిచ్చేలా ప్రభుత్వం బీమా పథకాలు అమలు చేస్తోంది. అయితే గతంలోవలే బీమా నమోదుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, కేవలం యాప్‌ ద్వారా ఇంటివద్దే కూర్చుని నమోదయ్యే సౌలభ్యాన్ని ప్రభుత్వం కలి్పంచింది.

సాక్షి, ముప్పాళ్ల/సత్తెనపల్లి/కారంపూడి: రైతులు రానున్న రోజుల్లో మీసేవా కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వ్యవసాయశాఖ సిబ్బంది వద్ద ఈ–కర్షక్‌ యాప్‌లో పంట వివరాలు నమోదు చేసుకుంటే చాలు, పంటల బీమా వర్తించినట్లే. ఆ మేర వ్యవసాయశాఖ ఈ రబీ నుంచే ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యవసాయశాఖ పంటల బీమాపై సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. గత ఏడాది రబీ వరకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద ఎంపిక చేసిన ఏజెన్సీకి రైతులే బీమా ప్రీమియం చెల్లించేవారు. ఆ తర్వాత ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. గడిచిన ఖరీఫ్‌కు కూడా ప్రభుత్వమే ప్రీమియంను రైతులు బ్యాంకులు, మీ సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది నవంబరులో రబీ పంటల బీమాకు షెడ్యూల్‌ విడుదల చేసినా...సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నమోదు ప్రక్రియలోనూ మార్పులు చేసింది. ఇకపై ఈ–కర్షక్‌ యాప్‌లో పంటలు నమోదు చేసుకున్న వారికి బీమా వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రైతులకు వెసులుబాటు కలగనుంది. 

ఇకపై ఇదే కీలకం... 
ఇకపై ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లో ఈ–కర్షక్‌ యాప్‌ ద్వారా రైతులు వేసిన పంటలను నమో దు చేస్తారు. వ్యవసాయశాఖ ద్వారా అమలు చేసే రాయితీ పథకాలు మొత్తం దీని ఆధారంగానే అందజేస్తారు. రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి మొబైల్‌ అప్లికేషన్‌ నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జేడీఏ కార్యాలయంలో ఒక నోడల్‌ అధికారిని నియమిస్తారు. అంతర్‌పంటలు, పండ్లతోటలు, కూరగాయల సాగు, మొదటి, రెండు, మూడు పంటలు దేనికి దానికి యాప్‌లో సమగ్ర వివరాలు నమోదు ఆప్షన్లు ఇచ్చారు. 

నమోదు ఇలా.... 

  • గ్రామ సచివాలయంలో ఉన్న వీఏఏ/హెచ్‌ఏ/ఎస్‌ఏఏ,వీఆర్‌ఓల సమన్వయంతో తమ పరిధిలో ఉన్న రైతులు తాము వేసిన పంటల తాలుకు వివరాలను మొబైల్‌ అíప్లికేషన్‌ నందు నమోదు చేయాలి. 
  • సీజన్‌వారీగా ఖరీఫ్, రబీ మరియు వేసవి పంట కాలంలో విడివిడిగా నమోదు చేయాలి. 
  • గ్రామ సచివాలయ స్థాయి నమోదు ప్రక్రియను సంబంధిత వ్యవసాయాధికారి పర్యవేక్షించి నమోదయిన డేటాను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అ«దీకృతం చేయవలసి ఉంటుంది. 
  • సమాచారాన్ని జేడీఏ కార్యాలయంలో కేటాయించిన అధికారి పర్యవేక్షణ అనంతరం జిల్లా జేడీఏ కార్యాలయంలో నియమించిన అధికారి కమిషనరేట్‌ కార్యాలయానికి సమాచారం అందిస్తూ ఉంటారు. ​​​​​​

ప్రయోజనం ఇలా... 

  • ఇకపై బ్యాంకు ద్వారా రుణం పొందేవారు..ఆయా బ్యాంకుల్లో బీమా కింద రిజి్రస్టేషన్‌ చేయించుకోనవసరం లేదు. రుణం పొందని వారు కామన్‌సరీ్వసు సెంటర్‌లో నమోదు చేసుకోనవసరం లేదు. 
  • ఏ బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. 
  • అక్టోబరు 1, 2019 తర్వాత బ్యాంకులు పంట రుణం నుంచి బీమా ప్రీమియం వసూలు చేసి ఉంటే, దానిని తిరిగి రైతులకు చెల్లిస్తారు. బ్యాంకులు రైతుల వద్ద వసూలు చేసిన ప్రీమియం సొమ్మును కంపెనీకి జమ చేసి ఉంటే తిరిగి చెల్లిస్తారు. 
  • అర్హత కలిగిన అన్ని క్లెయిమ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంబంధిత సాగుదారుని ఆధార్‌ అనుసంధానం బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది.

నోడల్‌ ఏజన్సీగా వ్యవసాయశాఖ
నూతన విధానం అమలుకు వ్యవసాయశాఖను నోడల్‌ ఏజెన్సీగా ఎంపిక చేశారు. పంటల బీమా పథకంలో చేరడానికి ముందుగా ఆధార్‌ కలిగిన సాగుదారుడి వివరాలు ఇ–కర్షక్‌ అనే ఆండ్రాయిడ్‌ యాప్‌లో నమోదు చేస్తారు. అందుకోసం నిరీ్ణత గడువు విధించారు. రబీలో శనగపంటకు జనవరి 31, మిగిలిన అన్నిపంటలకు ఫిభ్రవరి 15 గడువుగా పేర్కొన్నారు. సొంత రైతు, కౌలు రైతు అనే వివరాలు ఇ–కర్షక్‌యాప్‌ ద్వారా గుర్తిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top