నెలరోజుల్లో వేతనాల విషయం తేల్చకుంటే సమ్మెలోకి.. | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో వేతనాల విషయం తేల్చకుంటే సమ్మెలోకి..

Published Tue, Jul 17 2018 3:32 AM

Dwakra animators and RPs ultimatum to the state government - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పది వేల రూపాయల వేతనం ఇస్తామని ప్రకటిస్తే గానీ ఈ ప్రభుత్వంలో చలనం రాలేదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే వీవోఏ (డ్వాక్రా యానిమేటర్లు), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే ఆర్‌పీ (పట్టణ రిసోర్సు పర్సన్‌)లు మండిపడ్డారు. తమ వేతనాల విషయంలో నెల రోజుల్లోగా సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే సమ్మెలోకి వెళతామని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. వీవోఏలు, ఆర్‌పీలకు నెలకు రూ. 5,000 వేతనం చెల్లించాలని, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వేలాది మంది డ్వాక్రా యానిమేటర్లు, ఆర్‌పీలు విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి స్థానిక అలంకార్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చౌక్‌లో పెద్దఎత్తున ధర్నా చేశారు. ఏపీ వెలుగు వీవోఏ సంఘం, ఏపీ మెప్మా ఆర్‌పీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, సీఐటీయూ నాయకులు మద్దిలేటి, అలివేణి నేతృత్వంలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ పాల్గొని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు.

వీవోఏలు, ఆర్‌పీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా మెప్మా ఎండీ చిన తాతయ్య ధర్నా చౌక్‌ వద్దకు వచ్చారు. ఆగస్టు 15లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఈ ప్రకటనపై ఆందోళనకారులు మండిపడ్డారు. రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్‌ను అమలు చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేయతలపెడితే.. ఆదిలోనే అణిచివేయడానికి ప్రయత్నించారని, గృహ నిర్భందంలో ఉంచారని మండిపడ్డారు. 

ప్రకటన చేస్తే సరిపోదు.. 
ధర్నాలో నేతలు ప్రసంగిస్తూ.. వేతనాలు చెల్లింపుపై సీఎం కేవలం ప్రకటన చేయడమో లేదంటే సర్కులర్లు జారీ చేయడమో కాకుండా పూర్తి విధి విధానాలతో జీవో జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ. 2 వేలు వేతనం చెల్లించడానికి అప్పటి ప్రభుత్వం సర్కులర్‌ జారీ చేయడయే కాకుండా, 2 నెలలు వేతనాలు కూడా ఇచ్చారని తెలిపారు. తర్వాత అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వం వీవోఏలు, ఆర్‌పీలకు వేతనం చెల్లించడం నిలిపివేసిందని మండిపడ్డారు. వీవోఏలకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రూ. 2 వేల వేతనాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుండా నాలుగేళ్లుగా ఇబ్బంది పెడుతోందని గఫూర్‌ దుయ్యబట్టారు. 

Advertisement
Advertisement